తెలంగాణ లో గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని బట్టబయలు చేసేందుకు ప్రత్యేక కమిటీలను వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) పిల్లర్ కుంగిపోవడం తో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు (Telangana Ministers Visit) సందర్శించారు. బ్యారేజీలోని ఏడవ బ్లాకులో 16-20 పిల్లర్లు దెబ్బతిన్నందున వాటిని పూర్తిగా ధ్వంసం చేసి కొత్త నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నదన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పుడున్న స్ట్రక్చర్ ఉపయోగానికి అనువుగా లేనందున కొత్తది కట్టడం అనివార్యమని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం దెబ్బతిన్న పిల్లర్లను తొలగించడానికి, పక్కన ఉన్న బ్లాక్‌లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్నదానిపై సాంకేతిక చర్చలు కంప్లీట్ అయ్యాయి. డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ వన్ టైమ్ బ్లాస్ట్, డైమండ్ వైర్ సా అనే మూడు రకాల పద్ధతుల్లో ఏది ఆచరణాత్మకంగా ఉంటుందనే టెక్నిక్‌లపై అధ్యయనం జరిగింది. మొదటి రెండు విధానాల ద్వారా ఇప్పుడున్న స్ట్రక్చర్‌ను తొలగించడంలో అనుకూల ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడవ పద్ధతి శ్రేయస్కరమనే ప్రాథమిక నిర్ణయం జరిగింది. కానీ నిపుణుల నుంచి మరింత లోతైన అధ్యయనంతో కూడిన నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది.
ఇక ఈ సందర్భాంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపు సమస్యపై చర్చ జరిగిందని , బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి మూడు బ్యారేజ్‌లు కట్టారని చెప్పారు. రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందే ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం కట్టారని అన్నారు. భారీ వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. దీన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. దీనిపై వాస్తవాలు తెలుసుకునేందుకు పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని ..అందుకే ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని తనిఖీ చేయడానికి వచ్చామని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని , ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్ట్ డ్యామేజ్ కావడం బాధాకరమని అన్నారు.
Read Also : Good News to Movie Lovers : మూవీ పాస్ విధానాన్ని తీసుకరాబోతున్న ‘పీవీఆర్’