Telangana Ministers : తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు కలిసి రేపు (ఏప్రిల్ 2న) సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించాలని కోరుతూ బుధవారం రోజు ఢిల్లీ వేదికగా మహాధర్నాకు బీసీ సంక్షేమ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనిలో పాల్గొని సంఘీభావం తెలపనున్న నేతల జాబితాలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి , ఈర్లపల్లి శంకరయ్య , అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా మహాధర్నాలో పాల్గొనబోతున్నారు.
Also Read :Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లపై అసెంబ్లీలో చర్చ.. ఎందుకు ? ఏమైంది ?
ఏప్రిల్ 2,3 తేదీల్లో..
ఏప్రిల్ 2,3 తేదీల్లో రాహుల్ గాంధీ సహకారంతో వివిధ పార్టీల ముఖ్య నేతలను(Telangana Ministers) కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ కాంగ్రెస్ బృందం మద్దతు కోరనుంది. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణలో చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు సహకరించమని రిక్వెస్ట్ చేయనున్నారు. మన దేశంలో రాజ్యాంగ సవరణ ద్వారా 50శాతానికిపైగా రిజర్వేషన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే తరఫున కనిమొళి మహా ధర్నాలో పాల్గొననున్నారు.
Also Read :Imran Khan : నోబెల్‌శాంతి పురస్కారానికి ఇమ్రాన్ పేరు.. తెర వెనుక జెమీమా!
బీజేపీ నేతలు హాజరయ్యేనా ?
బీసీ సంఘాలు తలపెట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణలోని అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఈ ధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్, బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ నుంచి మధుసూధనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొంటున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, టీజేఎస్ అధినేత కోదండరాం ధర్నాకు హాజరు కానున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లులకు బీజేపీ మద్దతు ఇచ్చినా, ఢిల్లీలో నిర్వహించే మహాధర్నాలో ఆ పార్టీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైలులో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.