Site icon HashtagU Telugu

AICC President Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించిన తెలంగాణ మంత్రులు!

AICC President Kharge

AICC President Kharge

AICC President Kharge: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేని (AICC President Kharge) తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు మంగళవారం బెంగళూరులో పరామర్శించారు. ఇటీవల గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొంది, పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చేయించుకున్న ఖర్గే గారు ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్నారు.

తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో పాటు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ఖర్గేని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు ఖర్గే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “మా ప్రియతమ అధ్యక్షుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అనారోగ్యం నుంచి త్వరగా పూర్తిగా కోలుకోవాలని, తిరిగి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని, ఆయన సలహాలు, మార్గదర్శకత్వం పార్టీకి చాలా అవసరమని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Jubilee Hills Bypoll : నవీన్ కు టికెట్ ఇవ్వొద్దంటూ మీనాక్షి నటరాజన్‌ కు మహిళ లేఖ

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశానికి, పార్టీకి ఖర్గే అందించిన సేవలను కొనియాడారు. “ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న తరుణంలో ఆయన నాయకత్వం, అనుభవం మాకు ఎంతో అవసరం. ఆయన అనారోగ్యం గురించి తెలుసుకొని చాలా బాధపడ్డాం. డాక్టర్ల సూచనల మేరకు ఖర్గే విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ పార్టీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిసి సంతోషించాం. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి తిరిగి వచ్చి, పార్టీ కార్యకలాపాలను నడిపించాలని కోరుకుంటున్నాము” అని ఆయన తెలిపారు.

తెలంగాణ మంత్రులు ఖర్గేతో దాదాపు అరగంట పాటు గడిపి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version