Harish Rao: మిలియన్ మార్చ్ హైదారాబాద్ గల్లీలో కాదు.. ఢిల్లీలో పెట్టు!

మిలియన్ మార్చ్ హైదరాబాద్ గల్లీలో కాదు అని, దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని బండి సంజయ్ ను ఉద్దేశించి, తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

  • Written By:
  • Updated On - January 29, 2022 / 03:48 PM IST

మిలియన్ మార్చ్ హైదరాబాద్ గల్లీలో కాదు అని, దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని బండి సంజయ్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు లతో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు బీజేపీపై ఫైర్ అయ్యారు.

ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేత‌లు దొంగ జ‌పం చేస్తున్నారని. దొంగే దొంగ అంటున్నారని,  అస‌లు ఉద్యోగాలు ఇచ్చింది ఎవ‌రు…? ఇవ్వంది ఎవరు..? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. నోటిఫికేష‌న్లు ఇచ్చింది ఎవ‌రు.. నోటిఫికేష‌న్లు ఇవ్వనిది ఎవ‌రు..? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా అని నిలదీశారు. బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలి.. గాలి మాట‌లు కాదు.. ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి, మీ బిజెపి హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నోటికి వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి త‌ప్పుడు ప్రచారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు అవుతుందా.. నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ట్లు అవుతుందా..? ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ పాల‌న‌లో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ ప‌డుతుందో బండి సంజ‌య్ తెలుసుకోవాలని, హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేయడం కాదు.. బండి సంజయ్.. ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత నియామ‌కాలకు టీఆర్ ఎస్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ను ప్రభుత్వం భ‌ర్తీ చేసిందని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఒక్క టీఎస్‌పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టుల‌ను ప్రభుత్వం భ‌ర్తీ చేసిందని, తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు, జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రెట‌రీలు 9,355, సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ 12,500, విద్యుత్ సంస్థల ద్వారా 6,648, డీసీసీబీలు 1571, టీఆర్‌టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచ‌ర్ పోస్టులు, మొత్తంగా ఇప్పటివరకు 1,32,899 ఉద్యోగాల‌ను  ప్రభుత్వం భ‌ర్తీ చేసిందనీ, మ‌రో 50 నుంచి 60వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు క‌స‌రత్తు చేస్తోందని రావు పేర్కొన్నారు.

నిరుద్యోగ దీక్ష పేరుతో రాష్ట్రంలో దొంగ దీక్షలు చేస్తున్న బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ఉందా?. ఈ కోటి మంది నిరుద్యోగుల కోసం వారు ఎక్కడ దీక్ష చేస్తారో చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే.. బిజెపి నేతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంటే… కేంద్రంలోని బిజెపి దేశాన్ని నిరుద్యోగ భారత్ గా మార్చుతుందని మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై ఫైర్ అయ్యారు.