Harish Rao: ఏం ఇచ్చారు.. ఏం చేశారు..? బీజేపీపై హరీశ్ రావు ఫైర్!

తెలంగాణ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ నారాయణ్ పేట జిల్లాలో పర్యటించారు.

  • Written By:
  • Updated On - June 6, 2022 / 03:10 PM IST

తెలంగాణ ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇవాళ నారాయణ్ పేట జిల్లాలో పర్యటించారు. పలు డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. రూ. 56 కోట్లతో 390 పడకల ఆసుపత్రి, రు. 1.25 కోట్లతో టి డయాగ్నొస్టిక్ నిర్మాణాలకు శంకుస్ధాపన, రూ. 5.98 కోట్లతో ఎర్రగుట్ట నుండి ఎక్లాస్ మీదుగా తెలంగాణ – కర్ణాటక సరిహద్దు వరకు నిర్మించిన 5.5 కిలోమీటర్ల రోడ్డును, డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ జిల్లాలో 390 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం శంకుస్ధాపన చేసుకోవడం శుభదినమని, కేసీఆర్ వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు.

నాగం జనార్ధన్ రెడ్డి, డీకే అరుణ లాంటివాళ్లు గతంలో మంత్రులుగా ఉన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకురాలేదు. కానీ ప్రస్తుతం ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే మొత్తం 4 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతున్నదని ఆయన గుర్తు చేశారు. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ గారు 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. నారాయణ్ పేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకానుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు డయాలసిస్ సేవలు అందేలా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసే టి డయాగ్నొస్టిక్ సెంటర్ ని ప్రారంభించామని అన్నారు. ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, టు డి ఏకో సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని హరీశ్ రావు అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంట్ రైతులకు అందుబాటులో ఉందని, బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యకావడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. 57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు అవుతుందని కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మన వడ్లను కేంద్రం కొనలేదు. బండి సంజయ్ ఏం ముఖం పెట్టుకొని పాద యాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.  ప్రధాని ఏం ముఖం పెట్టుకొని వస్తారు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన హామీలు ఎందుకు ఇవ్వరు? అని మంత్రి హరీశ్ రావు బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు.