PM Kisan: అన‌ర్హుల‌కు పీఎం కిసాన్ ప‌థ‌కం.. బ‌య‌ట‌పెట్టిన ఆడిట్ ఏజెన్సీ

తెలంగాణాలో పీఎం-కిసాన్ పథకం నిర్వ‌హ‌ణ‌లో లోపాలు ఉన్నాయ‌ని ఆడిట్ ఏజెన్సీ నివేదిక వెల్ల‌డించింది. పీఎం కిసాన్ పథకం కింద కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బు బదిలీ చేయబడింద‌ని నివేదిక ద్వారా బ‌య‌ట‌ప‌డింది.

  • Written By:
  • Publish Date - January 23, 2022 / 11:31 AM IST

తెలంగాణాలో పీఎం-కిసాన్ పథకం నిర్వ‌హ‌ణ‌లో లోపాలు ఉన్నాయ‌ని ఆడిట్ ఏజెన్సీ నివేదిక వెల్ల‌డించింది. పీఎం కిసాన్ పథకం కింద కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బు బదిలీ చేయబడింద‌ని నివేదిక ద్వారా బ‌య‌ట‌ప‌డింది. దీనిపై ఆడిట్ ఏజెన్సీ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖను నిలదీసింది. పీఎం కిసాన్ పథకం కింద ఒక రైతుకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. కరీంనగర్ జిల్లా క్లస్టర్ల వారీ మ్యాపింగ్ ప్రకారం.. గన్నేరువరం మండలంలోని చెర్లపూర్ గ్రామం ముంపు గ్రామం ఉనికిలో లేదు. అయితే పీఎం కిసాన్ లబ్ధిదారుల డేటాను ధృవీకరించినప్పుడు చెర్లపూర్ గ్రామంలో 94 మంది లబ్ధిదారులు పథకం కింద నమోదు చేయగా, 687 వాయిదాల మొత్తంలో రూ.13.74 లక్షలు పొందినట్లు బ‌య‌ట‌ప‌డింది. ఆడిట్ ఏజెన్సీ ప్రకారం, అనర్హులను వ్యవసాయ శాఖ ల‌బ్ధిదారుల‌ను ఆమోదించడం వ్య‌వ‌సాయ‌శాఖ నిర్ల‌క్ష్యంగా ఆడిట్ ఏజెన్సీ పేర్కొంది. స్వీయ-నమోదిత లబ్ధిదారుల ఆమోదం కోసం రాష్ట్ర శాఖ ఎప్పటికప్పుడు సూచనలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. పీఎం కిసాన్ ప‌థ‌కం అమ‌లుకు వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇది కాక అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఈ పథకం నుండి ప్రయోజనం పొందారు. జిల్లాల రికార్డుల పరిశీలనలో అనర్హులుగా ప్రకటించిన తొమ్మిది కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు,వారి జీవిత భాగస్వాములు, పెన్షనర్లకు పథకం ప్రయోజనాలు చెల్లించినట్లు వెల్లడైంది. ఈ లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకుని వ్యవసాయ శాఖ ఆమోదం పొందినట్లు చెబుతున్నారు. వారికి రూ. 0.52 లక్షల మొత్తంలో 26 వాయిదాలు చెల్లించబడ్డాయి. ఈ కేసులు ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయని.. సభ్యులు పథకం ప్రయోజనాలను పొందుతూనే ఉన్నారని ఆడిట్ నివేదిక గుర్తించింది.

వ్యవసాయ శాఖ స్వీయ రిజిస్టర్డ్ రైతులను ఆమోదించడంలో జాప్యం చేయడం వల్ల చాలా మంది రైతులు ప్రయోజనం పొందలేకపోతున్నారని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2021 నాటికి, 1,88,370 మంది రైతులు ఈ పథకం ఎన్‌రోల్‌మెంట్ కోసం ఆన్‌లైన్ మోడ్‌లో నమోదు చేసుకున్నారని నివేదిక పేర్కొంది. వీటిలో 88,225 దరఖాస్తులు ఆమోదించబడ్డాయని.. 28,401 దరఖాస్తులను శాఖ తిరస్కరించింది. అయినప్పటికీ, 71,743 దరఖాస్తులు ఇప్పటికీ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి, ఫలితంగా అర్హులైన రైతులకు ప్రయోజనాలను బదిలీ చేయడంలో జాప్యం జరిగింది. 2018, 2019, 2020 మూడు పాలసీ సంవత్సరాలకు సంబంధించిన రైతు బీమా క్లెయిమ్ డేటాతో PM-కిసాన్ పథకం యొక్క నమూనా లబ్ధిదారుల డేటాను కూడా ఆడిట్ నివేదిక ధృవీకరించింది. మృతి చెందిన రైతుల వివరాలు డేటాబేస్ నుండి తొలగించబడలేదని ఆడిట్ గుర్తించింది.
చనిపోయిన రైతుల పేర్లను తొలగించకపోవడంతో అనర్హుల ఖాతాల్లోకి రూ.161.34 లక్షలు జమ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో, వ్యవసాయేతర భూమి ఉన్న వ్యక్తులకు పథకం ప్రయోజనాలు చెల్లించబడ్డాయి. వారు తొమ్మిది వాయిదాల మొత్తంలో రూ.0.18 లక్షలు పొందారు.