Site icon HashtagU Telugu

Solar Manufacturing Project : తెలంగాణ నుండి ఏపీకి తరలిపోతున్న ప్రాజెక్టులు – కేటీఆర్

Solar Manufacturing Project

Solar Manufacturing Project

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తెలంగాణ(Telangana)లో పెట్టుబడులు తగ్గిపోతున్నాయనే ఆరోపణల కొనసాగుతున్న వేళ తాజాగా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ (Solar Manufacturing) రంగంలో కీలకమైన రూ.1700 కోట్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోవడం సంచలనంగా మారింది. ప్రీమియర్ ఎనర్జీస్ (Premier Energies) లిమిటెడ్ కంపెనీకి చెందిన ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో ఏర్పాటు కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళింది. ఈ ఘటనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో BRS హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతోందని ఆయన విమర్శించారు.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుండగా, ఓ నెటిజన్ ప్రీమియర్ ఎనర్జీస్ ప్రాజెక్ట్ తెలంగాణ నుంచి ఏపీకి తరలిపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన కేటీఆర్ “గుజరాత్‌కి కేన్స్, తమిళనాడుకు కార్నింగ్ ప్రాజెక్టును వదిలేశారు. ఇప్పుడు ప్రీమియర్ కూడా ఏపీకి వెళ్తోంది. ఇది రాహుల్ గాంధీ ప్రభుత్వ వైఫల్యం” అంటూ ట్వీట్ చేశారు. ఆయన మాటల్లో తెలంగాణలో పెట్టుబడులు తగ్గిపోతున్నాయని, పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆరోపణ కనిపిస్తోంది.

కేటీఆర్ చేసిన ఈ విమర్శలపై కాంగ్రెస్ నేతలు కూడా ప్రతిస్పందించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులను తెలంగాణలోనే నిలుపుకోవడానికి కొత్త ప్రణాళికలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే పెట్టుబడులు తరలిపోవడానికి ఉన్న కారణాలు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తీసుకునే చర్యలు అనేవి కీలక అంశాలుగా మారాయి. ప్రస్తుతం పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయనే వాదనకు అధికార పక్షం ఎలా సమాధానం చెబుతుందో చూడాలి. పెట్టుబడులను రాష్ట్రంలో నిలిపేందుకు ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు కీలకం. ఇతర రాష్ట్రాలు ఉత్పాదన వ్యయాలు తక్కువగా ఉండే విధంగా, సౌకర్యవంతమైన పాలసీలు అమలు చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ పరిస్థితిలో తెలంగాణ తన పోటీ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమల వర్గాలు సూచిస్తున్నాయి.