CM Revanth Reddy : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, ఇతర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ముందుగా నిర్వహించాల్సిన ఎన్నికల అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కోర్టుకు సమర్పించాల్సిన అంశం కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఇస్తారని సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా రిజర్వేషన్ల అమలుపై స్పష్టత కోసం జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ రూపొందించింది. ఇందులో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఆర్డీవోలు పాల్గొంటారు. మార్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో రిజర్వేషన్ల అమలు విధానం, జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కేటాయింపు, తప్పులను నివారించే మార్గాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
WPL Full Schedule 2025: డబ్ల్యూపీఎల్ 2025 షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్
ఓటింగ్ శాతం పెంచేందుకు సుప్రీంకోర్టు సూచించిన ‘నోటా’ (NONE OF THE ABOVE) ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయనుంది. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు నోటాకు ఓటు వేయగలరు. అయితే, నోటాకు అధిక ఓట్లు వచ్చినా ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉండదని స్పష్టం చేయబడింది. మునుపటి లోకల్ బాడీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, తెలంగాణలో ఈ విధానం ఎలా అమలు చేయాలో ఈసీ స్పష్టత ఇవ్వనుంది.
ఇదిలా ఉండగా, పలు రాష్ట్రాల్లో సర్పంచ్ పదవులను వేలం వేస్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అన్ని గ్రామాల్లో ఎన్నికలు జరుగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈసీ బుధవారం రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. మాసాబ్ ట్యాంక్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణికుముదిని అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు సమావేశం జరుగుతుంది. ఇందులో ఎన్నికల ఏర్పాట్లతో పాటు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకునే అవకాశముంది. ఫిబ్రవరి 15 లేదా 16 నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం.
ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో వేగంగా ముందుకు సాగుతుండటంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక నాయకుల్లో టెన్షన్ నెలకొంది. తమకు అనుకూలంగా రిజర్వేషన్ వస్తుందా? పార్టీ టికెట్ వస్తుందా? గెలుపు అవకాశాలెంత? వంటి సందేహాల్లో అభ్యర్థులు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా సాధించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, సుప్రీంకోర్టు నియమాల ప్రకారం ప్రతి స్థానానికి ఎన్నిక జరగాల్సిన అవసరముందని ఈసీ స్పష్టం చేసింది. పార్టీ టికెట్ లభించకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో శుభ, అశుభ కార్యక్రమాల్లో నాయకుల హడావిడి పెరిగింది. నియోజకవర్గ స్థాయి నేతలను కలుస్తూ తమ భవిష్యత్తుపై చర్చించుకుంటున్నారు.
జనాభా లెక్కల ప్రకారం ఏ ప్రాంతానికి ఏ రిజర్వేషన్ వర్తించనుందో ముందుగానే అంచనా వేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ దిశానిర్దేశంతో ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. అధికార పార్టీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను రూపొందిస్తున్నాయి. ప్రజాస్వామ్య పటిమకు దోహదం చేసేలా ఈ ఎన్నికలు జరుగుతాయని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
Chiranjeevi Politics : రాజకీయాలకు జోలికి వెళ్ళాను – చిరు ఫుల్ క్లారిటీ