Komatireddy Venkat Reddy : తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 10 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వివరాల ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతల్లో జరిగే అవకాశముంది. తొలి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత రెండో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సన్నాహాలు ఎన్నికల సంఘం వేగవంతం చేసింది.
ప్రస్తుతం అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఆమోదం తర్వాత మండలిలో కూడా ఆ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి వారం రోజుల సమయం కోరింది.
Air India: ఇంజిన్‌లో అగ్గి రవ్వలు.. వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ దిశగా అడుగులు వేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 10లోపు విడుదల చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 4 లేదా 5న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం 6 లేదా 7న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలను స్వీకరిస్తారు. పరిశీలనల అనంతరం 8 లేదా 9న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. దీంతో సెప్టెంబర్ 10నాటికి ఎన్నికల ప్రక్రియ ఘనంగా ప్రారంభమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు విడుదల కాకపోవడంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఈ నిధులను తిరిగి పొందేందుకు కూడా ఎన్నికలు కీలకమని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు కూడా సెప్టెంబర్ 30లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ వెలువడనుంది. రెండు విడతల్లో జరిగే ఈ ఎన్నికలు, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపునిస్తాయని, అలాగే నిలిచిపోయిన నిధుల విడుదలకు దారి తీస్తాయని భావిస్తున్నారు.
Pawan- Bunny: అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. బన్నీతో ఉన్న ఫొటోలు వైరల్!