Liquor Shop: తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల (Liquor Shop) టెండర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఎక్సైజ్ శాఖ అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95,436 దరఖాస్తులు దాఖలయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గినా, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగింది.
భారీగా తగ్గిన దరఖాస్తులు
గతేడాది మద్యం దుకాణాల కోసం 1.32 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య ఏకంగా 37 వేలు తగ్గి 95,436 వద్ద ఆగిపోయింది.
ఆదాయం మాత్రం పెరిగింది
దరఖాస్తుల సంఖ్య తగ్గినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం లభించింది. దరఖాస్తు రుసుమును గతంలో కంటే పెంచి ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున నిర్ణయించడం వల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ. 218 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.
Also Read: Virat Kohli: సిడ్నీ వన్డే తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటారా?
గడువు పొడిగింపుపై హైకోర్టులో విచారణ
అక్టోబర్ 18వ తేదీతో ముగియాల్సిన దరఖాస్తుల గడువును ఆశించిన మేర ఆదాయం రాలేదనే కారణంతో ఎక్సైజ్ శాఖ అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది. అయితే ప్రభుత్వం గడువు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరపనుంది.
వ్యాపారులలో ఆందోళన
గడువు పొడిగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇస్తే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని మద్యం వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పారదర్శకత లేదంటూ పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు ఇచ్చే తీర్పుపై రాష్ట్ర ఎక్సైజ్ వర్గాల్లోనూ, వ్యాపారుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు ద్వారా ఈ ప్రక్రియ భవిష్యత్తు, ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలపై స్పష్టత రానుంది.
