Nizam College Issue: నిజాం కాలేజీ గర్ల్స్ హాస్టల్ వివాదంపై కేటీఆర్ రియాక్షన్!

తెలంగాణ ఐటీ మినిస్టర్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండటమే కాదు.. సోషల్ మీడియా ద్వారా వచ్చే రిక్వెస్టులను అంతే యాక్టివ్ గా పరిష్కారం

  • Written By:
  • Updated On - November 8, 2022 / 02:39 PM IST

తెలంగాణ ఐటీ మినిస్టర్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండటమే కాదు.. సోషల్ మీడియా ద్వారా వచ్చే రిక్వెస్టులను అంతే యాక్టివ్ గా పరిష్కారం చేస్తుంటారు. కేవలం ట్విట్టర్ ద్వారా ఇప్పటికే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టిన ఆయన తాజాగా హైదరాబాద్ నిజాం కాలేజీలో గర్ల్స్ హాస్టల్ వివాదంపై స్పందించారు. వెంటనే ఈ సమస్య విషయంలో జోక్యం చేసుకుని సామరస్యంగా పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆయన సూచించారు. హాస్టల్ నిర్మించిన తర్వాత కూడా విద్యార్థినులు ఇబ్బంది పడటం సరికాదన్నారు. వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని ట్విట్టర్లో కోరారు.

హైదరాబాద్ నిజాం కాలేజీ విద్యార్థినులకు అదే కాంపౌండ్ లో హాస్టల్ వసతి లేదు, వారికోసం ఉస్మానియా యూనివర్శిటీలో హాస్టల్ నిర్వహించేవారు. ప్రయాణ భారం తగ్గించాలని, నిజాం కాలేజీ దగ్గరే హాస్టల్ నిర్మించాలని విద్యార్థినులు కోరడంతో అప్పట్లో మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 8.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 9న కాలేజీ హాస్టల్ బిల్డింగ్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మహిళా మంత్రులు, నగర మేయర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మౌలిక సదుపాయాల కల్పన ఆలస్యం కావడంతో కాలేజీ నిర్వాహకులు ఈ విద్యాసంవత్సరంలో కూడా హాస్టల్ కేటాయింపుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు. పీజీ విద్యార్థినుల ఒత్తిడితో వారికి మాత్రమే ప్రస్తుతం హాస్టల్ వసతి కల్పించారు. దీంతో డిగ్రీ విద్యార్థినులు గొడవ చేస్తున్నారు. తమపై వివక్ష ఎందుకంటూ కాలేజీలో ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో ఈ గొడవ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కాలేజీలో హాస్టల్ బిల్డింగ్ కట్టించి ఇచ్చినా ఇలా గొడవ జరగడం, విద్యార్థినుల ఆందోళనను పోలీసులతో అడ్డుకోవాలని చూడటంపై మంత్రి కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. విద్యార్థినులకు వీలైతే నచ్చజెప్పాలని, లేదా వెంటనే పనులు పూర్తి చేసి వారికి కూడా హాస్టల్ వసతి కల్పించాలని ఆయన అన్నారు. దీనిపై చొరవ తీసుకుని సమస్యకు ముగింపు పలకాలంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్‌ సూచించారు. కేటీఆర్ చొరవ తీసుకోవడంతో అటు అధికారులు, ఇటు విద్యార్థినులు థ్యాంక్స్ చెప్పారు.