Telangana Jana Samithi: టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రామ్ ఎందుక‌లా అన్నారు.. అలాచేస్తే ఆయ‌న ల‌క్ష్యం నెర‌వేరుతుందా?

తాజాగా కోదండ‌రామ్ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రజ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు ఏ నిర్ణ‌యానికైనా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 08:30 PM IST

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌(Elections)కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుంది. ఈ ఏడాది చివ‌రిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్(CM KCR) దూకుడు పెంచారు. ఇక‌నుంచి జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఆదివారం నిర్మ‌ల్(Nirmal) జిల్లాలో కేసీఆర్ ప‌ర్య‌టించారు. భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు కేసీఆర్ దూకుడుతో వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. మ‌రోసారి బీఆర్ఎస్(BRS) అధికారంలోకి రాకుండా బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీల నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. సీఎం కేసీఆర్ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న సాగిస్తున్నాడ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీ ఈ ద‌ఫా ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. పార్టీలోని నేత‌లంతా ఏక‌తాటిపైకి వ‌స్తూ పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీఆర్ఎస్ నుంచి స‌స్పెండ్ అయిన‌ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావులతో పాటు మ‌రికొంద‌రు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను గ‌ద్దె దించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్య‌మ‌వుతుంద‌న్న భావ‌న‌లో వారున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో వారు కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం ఖాయమ‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రోవైపు వారు కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ జ‌న స‌మితి (టీజేఎస్) అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌సైతం వారితో క‌లిసిన‌డుస్తాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా కోదండ‌రామ్ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రజ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు ఏ నిర్ణ‌యానికైనా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. అవ‌స‌ర‌మైతే పార్టీని విలీనం చేస్తామ‌ని కోదండ‌రామ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కోదండ‌రాం.. రాష్ట్ర ఆవిర్భావ త‌ర్వాత తెలంగాణ జ‌న‌స‌మితి పేరుతో రాజ‌కీయ పార్టీని స్థాపించారు. 2018లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు పోటీచేసినా విజ‌యం సాధించ‌లేక పోయారు. కోదండ‌రాంసైతం ఓడిపోయారు. ఆ త‌రువాత ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్షాల‌తో క‌లిసి కేసీఆర్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న పొంగులేటి, జూప‌ల్లి వ‌ర్గంలో ఒక‌రిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారు ఏ పార్టీలోకి వెళితే కోదండ‌రాం ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అంద‌రూ ఒకే గొడుకు కింద‌కు చేరితే కేసీఆర్‌ను సుల‌భంగా గ‌ద్దెదించ‌వ‌చ్చున‌నే భావన‌కు కోదండ‌రాం వ‌చ్చిన‌ట్లు ఆయ‌న వ‌ర్గీయులు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు అవ‌స‌ర‌మైతే టీజేఎస్ ను విలీనం చేసేందుకుసైతం సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కోద‌డ‌రాం తాజా ప్ర‌క‌ట‌న తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది.

 

Also Read : Telangana BJP : టీడీపీతో క‌లిస్తే తెలంగాణ‌లో బీజేపీకి లాభ‌మా? న‌ష్ట‌మా? టీబీజేపీ ఎందుకు భ‌య‌ప‌డుతుంది?