Kaleshwaram Commission Notices : కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా

ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్‌ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.

Published By: HashtagU Telugu Desk
Telangana Jagruti Maha Dharna led by Kavitha

Telangana Jagruti Maha Dharna led by Kavitha

Kaleshwaram Commission Notices :  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్‌ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్‌ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ గారు ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రు ? కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే… మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అని కవిత అన్నారు.తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్పా ?.తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ కాదు… అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చు. కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు. కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు అన్నారు.

Read Also: Kamal Haasan : కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా

అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం… ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు ఇది. కేసీఆర్ గారిది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారు అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోంది. 90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలి అని కవిత అన్నారు.

తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు ?. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు. గోదావరి ‌ -పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాను అని కవిత అన్నారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయం. బకనచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలి. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. మంచిర్యాల, రామగుండం ప్రాంతంలో ధర్నాకు వస్తున్న జాగృతి కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ?. ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము. హైదరాబాద్ లో ధర్నా చేయనివ్వకపోతే జిల్లాల్లో, గల్లీల్లో ధర్నా చేస్తాం అని కవిత తెలిపారు.

Read Also: Praja Tirpu Dinam : విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ కావాలనుకున్న రోజు

 

  Last Updated: 04 Jun 2025, 12:07 PM IST