NITI Aayog Report: గుజరాత్ కంటే తెలంగాణే మెరుగు!

రైతాంగానికి సరిపడ విద్యుత్ అందించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందుందా..? అంటే అవుననే అంటోంది ‘నీతి అయోగ్’

  • Written By:
  • Updated On - April 12, 2022 / 03:35 PM IST

రైతాంగానికి సరిపడ విద్యుత్ అందించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందుందా..? అంటే అవుననే అంటోంది ‘నీతి అయోగ్’ తాజా సమాచారం ప్రకారం.. వ్యవసాయ రంగానికి విద్యుత్‌ను అందించడంలో గుజరాత్‌ కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది. “వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా”లో తెలంగాణ 100 స్కోర్ చేయగా, గుజరాత్ 11.4 పాయింట్లను మాత్రమే సాధించింది. నీతి ఆయోగ్ ‘స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్’ (SECI) రిపోర్ట్ ప్రకారం.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ 5.6 స్కోరు అందుకుంది. వ్యవసాయానికి సరిపడే విద్యుత్, ఇంధనం కింద తెలంగాణ 60.4 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. కేరళ మాత్రం ఈ విభాగంలో 67.3 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది.

తలసరి శక్తి వినియోగం, వ్యవసాయ,  పారిశ్రామిక రంగాలలో సరఫరా చేయబడిన విద్యుత్ గంటల, క్రాస్-సబ్సిడైజేషన్, లైఫ్-లైన్ విద్యుత్, టారిఫ్ అంశాల్లో గుజరాత్ 52.4 స్కోర్‌తో ఏడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 42.6 స్కోర్‌తో 18వ స్థానంలో నిలిచింది. అయితే డిస్కమ్‌ల ప్రదర్శనలో పంజాబ్ 77.1 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ 55.1 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచింది. పర్యావరణ సుస్థిరతలో తెలంగాణ 34.6 స్కోర్‌తో 12వ స్థానంలో నిలిచింది. కొత్త కార్యక్రమాల విభాగంలో 0.4 స్కోర్‌తో 19వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్’ (ఈసీబీసీ)ని ఆమోదించడంలో గణనీయమైన ప్రయత్నాలు చేస్తున్నాయని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, పర్యావరణ సూచిక రౌండ్-1 ర్యాంకింగులో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.