Inter Results : నెలలోపే ఇంటర్ ఫలితాలు. విద్యార్థులు, తల్లితండ్రుల్లో టెన్షన్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను నెలరోజుల లోపే వెల్లడిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

  • Written By:
  • Publish Date - May 20, 2022 / 01:31 PM IST

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను నెలరోజుల లోపే వెల్లడిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. వాల్యువేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, మొత్తం 15 కేంద్రాల్లో 15 వేల మంది అధ్యాపకులతో స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహిస్తున్నామని, ఈసారి కొత్తగా నిర్మల్‌, సిద్దిపేట, మంచిర్యాలలో కూడా వాల్యుయేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇంటర్‌ ప్రధాన పరీక్షలు విజయవంతంగా ముగిశాయని తెలిపిన జలీల్ 9.7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, కొన్నిచోట్ల చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నల్లో ప్రింటింగ్‌ తప్పిదాలు వచ్చాయని, వచ్చే ఏడాది అవి కూడా పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యువేషన్, ఫలితాల్లో జరిగిన తప్పిదాలు అనేకమంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యాయని ఈసారి ఏమవుద్దోనని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులు అధైర్య పడొద్దని, అపోహలను నమ్మొద్దని జలీల్ సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800 599 9333కి కాల్‌ చేయాలని సూచించారు.