హుజూరాబాద్ ఉప పోరుకు సై.. అక్టోబ‌ర్ 30 ఎన్నిక‌ల‌, న‌వంబ‌ర్ 2న ఫ‌లితం

ఏపీ, తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌ల పోరుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ప్ర‌ధాన పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ అక్టోబ‌ర్ ఒక‌టో తేదీన వెలువ‌డ‌నుంది.

  • Written By:
  • Publish Date - September 28, 2021 / 02:24 PM IST

ఏపీ, తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌ల పోరుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ప్ర‌ధాన పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ అక్టోబ‌ర్ ఒక‌టో తేదీన వెలువ‌డ‌నుంది. నామినేష‌న్ల ను ఎనిమిదో తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తారు. 16వ తేదీన ఉప‌సంహ‌ర‌ణ చివ‌రి రోజు. అక్టోబ‌ర్ 30 పోలింగ్‌, న‌వంబ‌ర్ 2న ఫ‌లితాలు వెలువ‌రించేలా షెడ్యూల్ విడుద‌ల అయింది. ఇదే షెడ్యూల్ ప్రకారం క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక ఉంటుంది.
మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త్ ర‌ఫ్ చేయ‌డంతో పార్టీకి ఈటెల రాజేంద్ర రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. ఆ క్ర‌మంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వ‌చ్చింది. నాట‌కీయ ప‌రిణామాల న‌డుమ ఈటెల బీజేపీలో చేరాడు. గ‌త నెల రోజులుగా ఆయ‌న హుజ‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్నారు. వ‌రుస‌గా గెలుస్తోన్న ఆయ‌న ఇప్పుడు జ‌రుగుతోన్న ఉప ఎన్నిక‌లో మ‌రోసారి విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఇంకో వైపు టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించింది. విద్యార్థి నాయ‌కునిగా టీఆర్ఎస్ పార్టీలో తొలి నుంచి పేరున్న గెల్లు విజ‌యం కోసం ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప‌నిచేస్తున్నారు. ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న హ‌రీశ్ దుబ్బాక ఎన్నిక‌ల్లో చేదు అనుభ‌వాన్ని రుచిచూశారు. కానీ, ఈసారి ఈటెల నుంచి ఓడించి ఇంటికి పంపాల‌ని క్షేత్ర‌స్థాయి వ్యూహాల‌కు ప‌దును పెట్టారు.
ప్ర‌భుత్వం దళిత బంధు ప‌థ‌కానికి హుజూరాబాద్ నుంచి శ్రీకారం చుట్టింది. ఆ ప‌థ‌కం గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యిస్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి విష‌యంలో ఇంకా ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది. కొండా సురేఖ‌ను నిల‌పాల‌ని పీసీసీ చీఫ్ భావిస్తున్నారు. కానీ, అక్క‌డ పోటీ చేయాలంటే రాబోవు సాధార‌ణ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల‌, వ‌ర్థ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ కుటుంబానికి చెందిన వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వాల‌ని కండీష‌న్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ప్ర‌త్యామ్నాయ అభ్య‌ర్థి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తున్న‌ట్టు తెలుస్తోంది.
బీజేపీ,టీఆర్ఎస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ ఉప ఎన్నిక ఫ‌లితాలు 2023 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ట్రైల‌ర్ మాదిరిగా ఇరు పార్టీలో అంత‌ర్గ‌తంగా భావిస్తున్నాయి. అందుకే స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఒక వేళ ఈటెల అక్క‌డ నుంచి గెలిస్తే, టీఆర్ ఎస్ స‌ర్కార్ ప‌రువు పోనుంది. ద‌ళిత బంధు ప‌థ‌కం న‌వ్వుల పాలు కాక త‌ప్ప‌దు. అదే, ఈటెల ఓడితే, ఇక ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మే. ఇప్ప‌టికే టీఆర్ఎస్ లో మాదిరిగా బీజేపీలో ఈటెల‌కు ప్రాధాన్యం క‌నిపించ‌డంలేదు. ఒక వేళ ఓడితే, చివ‌రి బెంచ్ లో కూర్చోవాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అందుకే, అటు టీఆర్ఎస్ ఇటు ఈటెల డూ ఆర్ డై సామెత‌లా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. కాంగ్రెస్ ప‌రోక్షంగా ఈటెల‌కు మ‌ద్ద‌తు ఇస్తుంద‌నే ప్ర‌చారం సాగుతోంది.
ఏపీలోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక ఫ‌లితం వైసీపీకి అనుకూలం కానుంది. వ‌రుస‌గా నాలుగు ప‌ర్యాయాలు టీడీపీ అక్క‌డ నుంచి గెలువ‌లేక‌పోయింది. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో వెంక‌ట సుబ్బ‌య్య గెలిచాడు. మ‌ళ్లీ అదే కుటుంబానికి చెందిన వాళ్ల‌కు టిక్కెట్ ఇచ్చి గెలిపించే బాధ్య‌త‌ను జ‌గ‌న్ తీసుకుంటారు. తిరుప‌తి పార్ల‌మెంట్ త‌ర‌హాలో బ‌ద్వేల్ ఫ‌లితం ఉంటుంద‌ని అంచ‌నా. బీజేపీ, జ‌న‌సేన సంయుక్త అభ్య‌ర్థిని అక్క‌డ నిలుపుతుందా? లేదా అనేది సందిగ్ధం. టీడీపీ అక్క‌డ నుంచి పోటీ చేస్తుందా ? లేక గ‌త సంప్ర‌దాయాల ప్ర‌కారం వైసీపీకి వ‌దిలేస్తుందా? చూడాలి.