Rats Bite Incident: ‘ఎంజీఎం ఘటన’పై సర్కార్ సీరియస్!

గురువారం వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను బదిలీ చేసింది.

  • Written By:
  • Updated On - April 1, 2022 / 04:23 PM IST

వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను బదిలీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి అధికారి తెలిపారు. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగి అప్పటి నుండి అపస్మారక స్థితిలో ఉన్నాడు. కృత్రిమ వెంటిలేషన్‌లో ఉంచారు. అయితే తెల్లవారుజామున రోగి చీలమండలు, మడమలలో రక్తస్రావం గమనించి  రోగి అటెండర్ ఫిర్యాదు చేశాడు. రోగి అటెండర్‌కు ఎలుకలు కనిపించనప్పటికీ.. ఎలుక కాటు వేసినట్లు అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు.

ఆసుపత్రి ఆవరణలో మిగిలిపోయిన ఆహారం పడేయడం, పాత డ్రైనేజీ వ్యవస్థ కారణంగా ఎలుకలు తిరుగాడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్ రావు పూర్తి వివరాలను కోరుతూ..  రోగికి మంచి చికిత్స అందించి జాగ్రత్త వహించాలని ఆదేశించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతోపాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ బి శ్రీనివాసరావును పరిపాలనాపరమైన కారణాలతో బదిలీ చేసినట్లు మార్చి 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, తదుపరి ఉత్తర్వుల కోసం ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. వరంగల్‌లోని జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ వి చంద్రశేఖర్‌ను సూపరింటెండెంట్ పోస్ట్‌కు పూర్తి అదనపు ఛార్జిగా ఉంచారు.