Site icon HashtagU Telugu

Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి

Highcourt Telangana

Highcourt Telangana

Telangana: తెలంగాణ హైకోర్టులో అరుదైన సంఘటన వెలుగుచూసింది. ఓ సివిల్ కేసు పిటిషనర్ న్యాయపరమైన హద్దులు దాటిపోతూ నేరుగా న్యాయమూర్తి చాంబర్‌లోకి ప్రవేశించి తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయడం చట్టపరమైన వర్గాలను కుదిపేసింది. ఇలాంటి అసాధారణ పరిణామాల కారణంగా సదరు న్యాయమూర్తి ఆ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో, కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.

అంబర్‌పేటకు చెందిన బి. చెన్నకృష్ణారెడ్డి 2008లో ఓ సివిల్ వివాదంపై అప్పీల్ దాఖలు చేశారు. న్యాయవాది అవసరం లేకుండా ఆయనే స్వయంగా కోర్టులో హాజరై వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసును విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక, గతంలో ఆయన పిటిషన్‌ను కొట్టివేశారు. అయితే దీనిపై చెన్నకృష్ణారెడ్డి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ కూడా మళ్లీ అదే న్యాయమూర్తి బెంచ్‌కే విచారణకు వచ్చింది.

Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్

ఈ నేపధ్యంలో, ఇటీవల చెన్నకృష్ణారెడ్డి ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా జస్టిస్ నగేశ్ భీమపాక చాంబర్‌లోకి వెళ్లారు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని, “మీరు ఎవరు చెప్పితే వింటారు? ఎవరితో చెప్పించమంటారు?” అని ప్రశ్నిస్తూ ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా, “నేను కేసును కొనసాగిస్తూ టార్చర్ పెట్టడం వల్లే నా ప్రత్యర్థి న్యాయవాది గుండెపోటుతో మరణించాడు” అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలు న్యాయమూర్తిని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో జస్టిస్ భీమపాక, “ఇలాంటి ప్రవర్తన అనుచితం. వాదనలు వినిపించాలంటే ఓపెన్ కోర్టులోనే చెప్పాలి” అని హెచ్చరిస్తూ, అతడిని వెంటనే చాంబర్‌ నుంచి బయటకు పంపించారు.

ఇక్కడితో ఆగకుండా, చెన్నకృష్ణారెడ్డి కోర్టులో కూడా అనుచిత ప్రవర్తన కొనసాగించారు. రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తిని నేరుగా నిలదీస్తూ, “ఎందుకు ఇప్పటికీ తీర్పు ఇవ్వలేదు?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మరోసారి కోర్టు గౌరవాన్ని దెబ్బతీశాయి. దీనిపై స్పందించిన జస్టిస్ భీమపాక, “మీరు నా చాంబర్‌లోకి వచ్చి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నాను. ఇకపై మీ వాదనలను వేరే బెంచ్ ముందుంచండి” అని స్పష్టం చేశారు. ఆయన మరింతగా మాట్లాడుతూ, “పిటిషనర్ సీనియర్ సిటిజన్ కావడంతో ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదు. అయినా ఇలాంటి ప్రవర్తన మళ్లీ పునరావృతం చేయరాదు” అని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో, జస్టిస్ నగేశ్ భీమపాక హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేస్తూ, కేసును వెంటనే వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలిపారు. ఈ ఘటన న్యాయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒక పిటిషనర్ నేరుగా జడ్జి చాంబర్‌లోకి వెళ్లి ఇలాంటి ఒత్తిడి చేయడం కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే చర్య అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా కోర్టు ధిక్కరణ చర్యలకు తావున్నప్పటికీ, వయసు కారణంగా క్షమాభిక్ష చూపడం న్యాయవ్యవస్థ మానవీయతకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Anushka Ghaati Talk : అనుష్క ‘ఘాటీ” మూవీ పబ్లిక్ టాక్