Telangana High Court: జవహార్ నగర్‌లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. శునకాల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని సూచించింది. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని వాదనల సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదన్నారు. రోడ్డపై వ్యర్తాల కారణంగా కుక్కల స్వైరవిహారం ఎక్కువైందని హైకోర్టు పేర్కొంది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. వీధి కుక్కలను నియంత్రించేందుకు స్టెరిలైజ్ చేస్తున్నట్లు ఏజీ… కోర్టుకు తెలిపారు. స్టెరిలైజ్ ద్వారా వీధికుక్కల దాడులను ఎలా ఆపుతారని హైకోర్టు ప్రశ్నించింది. కుక్కల దాడులను అరికట్టేందుకు ఆరు రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏజీ తెలిపారు. జంతు సంక్షేమ కమిటీలతో రాష్ట్రస్థాయి కమిటీలు సమన్వయం చేసుకొని పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
