Health Director Srinivas Rao : మ‌రోసారి వివాదాస్ప‌ద‌మైన హెల్త్ డైర‌క్ట‌ర్ తీరు!

క‌రోనా సమయంలో నిరంతరం ప్రజలకు సూచనలు చేస్తూ అందరికీ సుపరిచితమైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు

  • Written By:
  • Updated On - September 26, 2022 / 03:22 PM IST

క‌రోనా సమయంలో నిరంతరం ప్రజలకు సూచనలు చేస్తూ అందరికీ సుపరిచితమైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో శ్రీనివాసరావు క్షుద్రపూజలు చేశారని ఆరోపణలు వచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను శ్రీనివాస‌రావు తీవ్రంగా ఖండించారు. క్షుద్ర‌పూజ‌ల‌లో పాల్గొన‌లేద‌ని.. కేవ‌లం గిరిజన పూజలు మాత్రమే చేశానని వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. అయితే మ‌రోసారి శ్రీనివాసరావు వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదస్పదమైంది.

కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్‌ఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో శ్రీనివాసరావు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయ‌న డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బతుకమ్మ సంబురాల్లో సినిమా పాటలకు చిందులేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మ‌హిళ‌ల ప‌విత్ర‌ పండగ సంబరాల్లో ఇలాంటి చిందులేయడం ఏంట‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని.. తెలంగాణ సంస్కృతికి మ‌చ్చ తెస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

గ‌తంలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని జిమ్నా తండాలో నిర్వహించి పూజల్లో డీహెచ్ పాల్గొనడం అప్ప‌ట్లో వివాదాస్పదమైంది. స్వయంగా దేవతగా ప్ర‌క‌టించుకున్న‌ సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మి నిర్వహించిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన పూజల్లో పాల్గొన్న‌ట్లు వీడియో రావ‌డం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్న శ్రీనివాసరావు క్షుద్రపూజల్లో పాల్గొన్నారంటూ ప్రచారం జరిగింది.

క్షుద్ర పూజలు చేశార‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. అమ్మవారి పూజల్లో పాల్గొన్నానని.. అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాలకు వెళ్లానని ఆయ‌న అప్ప‌ట్లో వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.