BL Santosh: బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ కు ఊరట.. స్టే విధించిన హైకోర్టు..!

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్‌ పొలిటీషియన్‌ బీఎల్‌ సంతోష్‌కు ఊరట లభించింది.

  • Written By:
  • Updated On - November 26, 2022 / 10:51 AM IST

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్‌ పొలిటీషియన్‌ బీఎల్‌ సంతోష్‌కు ఊరట లభించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41-ఎ కింద బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. తనకు ఎందుకు సమన్లు ​​పంపుతున్నారో చెప్పనందున ఆ సమన్లను రద్దు చేయాలని సంతోష్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు.ఈ కేసులో బీఎల్ సంతోష్ నిందితుడు కాదు.. అనుమానితుడు కూడా కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శకంగా విచారిస్తుందన్న నమ్మకం లేదన్నారు.

అయితే బీఎల్ సంతోష్‌పై పక్కా ఆధారాలు ఉన్నాయని ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. 41 సీఆర్‌పీసీని అనుసరించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏజీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే 41 సీఆర్‌పీసీ నోటీసులపై స్టే విధించిన హైకోర్ట్ తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది. విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి ఈ నెల 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయినా బీఎల్ సంతోష్ హాజరుకాలేదు. దీంతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపైనే హైకోర్టు నేడు స్టే విధించింది.