Site icon HashtagU Telugu

Telangana High Court: నలుగురు పోలీసు అధికారులకు 4 వారాలు జైలుశిక్ష

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో మొత్తం నలుగురు హైదరాబాద్ పోలీసులకు 4 వారాల పాటు జైలుశిక్ష విధించింది.

జక్కా వినోద్ కుమార్ రెడ్డి, జక్కా సౌజన్య రెడ్డి గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆ నలుగురు పోలీసు అధికారులు వ్యవహరించారని అభియోగాలు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వకుండానే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేసినట్లు పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హైదరాబాద్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తోపాటు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ , జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‎రెడ్డి, ఎస్‎ఐ నరేష్‎కు 4 వారాల పాటు జైలుశిక్ష విధించింది. అలాగే ఈ నలుగురిపై శాఖా పరమైన క్రమశిక్షణా చర్యలు తీసీుకోవాలని సీపీకి ఆదేశించింది. అప్పీలుకు వెళ్లే వెసులుబాటును కల్పించేందుకుగానూ శిక్ష అమలును హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది.

Exit mobile version