Site icon HashtagU Telugu

Telangana HC: రాత్రి 10 గంటల తర్వాత నో మ్యూజిక్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!

Pub Imresizer

Pub Imresizer

హైదరాబాద్ నగరంలో ఉన్న క్లబ్‌లు, పబ్‌లు/బార్‌లకు ఉపశమనంగా తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత నో మ్యూజిక్ పై ఆంక్షలను ఎత్తివేసింది. జూబ్లీహిల్స్‌లోని నివాస ప్రాంతాలు మినహా నగరమంతటా ఉన్న వినోద కార్యక్రమాలపై ఆంక్షలను ఎత్తివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ వినిపించకూడదని ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పుపై రెస్టారెంట్ అసోసియేషన్ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది. జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు ఇది వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ లోని 10 పబ్‌లలో రాత్రి 10 తర్వాత ఎలాంటి మ్యూజిక్ పెట్టకూడదని స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ లో ఉన్న టాట్, జూబ్లీ 800, ఫర్జీ కేఫ్, అమ్నిషియా, హై లైఫ్, డైలీ డోస్, డర్టీ మార్టిని, బ్రాడ్వే, హార్ట్ కప్ పబ్‌లతో పాటు మరో కొన్ని పబ్‌ లలో 10 గంటల తర్వాత మ్యూజిక్ ఆపేయాలని బెంచ్ తెలిపింది. ఈ క్రమంలో పబ్‌ల విషయంలో తీసుకున్న చర్యలపై నివేదికలను సమర్పించాలని ముగ్గురు పోలీసు కమిషనర్లను, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 26 న ముగ్గురు పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ నివేదికలను కోర్టుకు అందించారు. అంతేకాకుండా.. నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలకు సమీపంలో పబ్‌లను అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.