High Court: క్రిస్మస్, న్యూయర్ వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టండి!

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

  • Written By:
  • Publish Date - December 23, 2021 / 05:42 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ ఇప్పటికే ప్రవేశించిందని.. ఈ వేరియంట్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొత్త వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో పండగలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించింది.

రాబోయే పండుగలు, వేడుకల నేపథ్యంలో బహిరంగ సభలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాన్ని కోరింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. డిసెంబర్ 21న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని దేశాలలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దేశవ్యాప్తంగా కోవిడ్ -19 నియంత్రణ చర్యలను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులను నిశితంగా ట్రాక్ చేసి పరీక్షించాలని, పాజిటివ్‌ అని తేలితే వెంటనే ప్రయాణికుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీలకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.