Gurukul PGT Exam: పీజీటీ పరీక్షల నిర్వహణలో సాంకేతిక లోపం.. అభ్యర్థుల నిరసన

తెలంగాణలో ఈ రోజు సోమవారం గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) పరీక్షలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యంగా జరగడంతో

Gurukul PGT Exam: తెలంగాణలో ఈ రోజు సోమవారం గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) పరీక్షలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యంగా జరగడంతో కొన్ని చోట్ల అభ్యర్థులు నిరసనలకు దిగారు. ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వెలుపల వేచి ఉన్నారు.

తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పీజీటీల భర్తీకి ఇంగ్లీష్ పరీక్ష అన్ని ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాల్లో ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్ణీత సమయానికి అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలేదు. సిబ్బందిని విచారించగా సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పరీక్ష నిర్వహణ ఆలస్యమైందని తెలిపారు. ఉదయం 10గంటలు దాటినా పరీక్ష ప్రారంభమయ్యే సూచనలు కనిపించకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్ష రాసేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన తమకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అభ్యర్థులు వాపోయారు.

హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లోని ఒక పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు హైదరాబాద్-విజయవాడ రహదారిపై కూర్చొని నిరసనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అభ్యర్థులను ఉదయం 10.30 గంటలకు కేంద్రంలోకి అనుమతించారు, చివరకు పరీక్ష ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైంది. ఫిజికల్ సైన్స్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటల నుంచి, బయోలాజికల్ సైన్స్ పరీక్ష సాయంత్రం 4.30 గంటల నుంచి జరగనుంది. దీంతో రెండు పరీక్షలను అధికారులు వాయిదా వేసే అవకాశం ఉంది.

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఆర్‌ఈఐఆర్‌బీ) తొమ్మిది కేటగిరీల్లోని 9210 పోస్టులకు ఆగస్టు 1 నుంచి పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు 2.66 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం 1,276 పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఆగస్టు 23న ముగియనున్నాయి.

Also Read: Monsoon Tours: చూడాల్సిందే తరించాల్సిందే, కమనీయం కర్ణాటక పర్యాటకం!