Site icon HashtagU Telugu

Telangana VRA: ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు

Telangana

New Web Story Copy (31)

Telangana VRA: తాతల, తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు ‘పే స్కేలు’ అమలుపరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.

ఈ సందర్భంగా ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్ఏ వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ జీతంతోని విఆర్ఎలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. విఆర్ఎల క్రమబద్ధీకరణను వీరంతా అభినందిస్తున్నారని సీఎం అన్నారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న విఆర్ఎలందరికీ సీఎం శుభాభినందనలు తెలిపారు.

10వ తరగతి అర్హత కలిగిన వారు 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాతో, డిగ్రీ ఆపై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఈ పోస్టులకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మరో కేటగిరీలో 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వారికి, వారు ఇంత కాలం సమాజానికి చేసిన సేవకు గాను, మానవీయ కోణంలో ఆలోచించి, వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్ తోనే వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం స్పష్టం చేశారు. విఆర్ఎల జెఎసి ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ లిస్తామని, ఈ ఆర్డర్ లోనే ఆ విషయాలను పొందుపరిచినట్లు సీఎం తెలిపారు. “వారు వారి పిల్లలను తీసుకొని వస్తే వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది. విఆర్ఎలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు” అని సీఎం స్పష్టం చేశారు. మీరందరూ ఆయా డిపార్ట్ మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని కోరుతున్నానని సీఎం వారికి సూచించారు.

Also Read: KTR Birthday: విప్లవాత్మక మార్పులకు కేటీఆర్ శ్రీకారం – దాసోజు శ్రవణ్

Exit mobile version