సింగపూర్ ITE కాలేజ్ సెంట్రల్తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి సింగపూర్‌కు చేరుకున్న ఆయన, శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.
CM Chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు ముందు తమిళనాడుకు షాకిచ్చిన చంద్రబాబు? ఏంటంటే?
ముందుగా ఈరోజు సింగపూర్ ITE (Institute of Technical Education) కాలేజ్ సెంట్రల్‌తో కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం ITE పాఠ్యాంశాలను రాష్ట్రంలోని స్కిల్ వర్సిటీ ఉపయోగించి, నైపుణ్యాల అభివృద్ధి కోసం ఒక శక్తివంతమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం. ఈ ఒప్పందంపై తెలంగాణ స్కిల్ వర్సిటీ యొక్క వైస్ చాన్సలర్ (వీసీ) మరియు ITE డిప్యూటీ డైరెక్టర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి కీలక భాగస్వామిగా సీఎం రేవంత్ ఉన్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలో ఉన్న విద్యార్ధులకి నైపుణ్యాల విషయంలో పెద్ద అవకాశాలను కల్పించనుంది. రాష్ట్రంలో వివిధ సాంకేతికతలలో విద్యావంతులైన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ITE సిలబస్ తో సహకారం అవసరం కాబోతుంది. మంత్రి శ్రీధర్ బాబు మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరగడం, రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధి ప్రయోజనాలను అందించడానికి ఒక కీలక దశగా మారింది. ITE ప్రతినిధులు త్వరలో హైదరాబాద్ లో పర్యటించనున్నారు.
అలాగే సింగపూర్‌లో రివర్ ఫ్రంట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో అక్కడ జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోనున్నారు. 18న సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో స్థానిక తెలుగు వారిని ముఖ్యమంత్రి బృందం కలవనుంది. సింగపూర్ పర్యటన అనంతరం రేవంత్ టీమ్ 20న దావోస్‌కు చేరుకుంటుంది. 20 నుంచి 22 తేదీ వరకు ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు 2025’లో పాల్గొంటుంది. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈ సారి అంతకు మించిన పెట్టుబడుల లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్షలో వెల్లడించారు.