Site icon HashtagU Telugu

DA For Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు

Telangana

Telangana

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరైంది. ఈ ప్రయోజనం 1 జూలై 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయంతో పెరిగిన DA జనవరి పెన్షన్‌తో పాటు ఫిబ్రవరిలో పెన్షనర్లకు ఇవ్వబడుతుంది. 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ వరకు ఎనిమిది వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  ఉన్న డీఏను 17.29 నుండి  20.02 శాతానికి పెంచింది ప్రభుత్వం,  డీఏ పెంపుతో  4.40 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది కలగనుంది.  డీఏ పెంపు కారణంగా  2.38 లక్షల మంది పెన్షనర్లకు  కూడా  ప్రయోజనం  కలగనుంది. ఎనిమిది విడతల్లో ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది.

మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4లోగా ప్రక్రియ పూర్తి.. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అనుమతి.. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన 15 రోజుల్లోగా అప్పీళ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై ఈ నెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల సమక్షంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు సమగ్రంగా చర్చించారు. చర్చలు సఫలం కావడంతో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, ఆమోదం మేరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఖరారు చేశారు.