Site icon HashtagU Telugu

Inter Board : నార్పింగి శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపు ర‌ద్దు.. సాత్విక్ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌నపై చ‌ర్య‌లు తీసుకున్న ఇంట‌ర్ బోర్డ్‌

Sri Chaitanya

Sri Chaitanya

ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌ను ఇంట‌ర్ బోర్డ్ సీరియ‌స్‌గా తీసుకుంది. .మృతుడు చదువుతున్న నార్సింగిలోని శ్రీ చైత‌న్య కార్పొరేట్ జూనియర్ కళాశాల గుర్తింపును ఇంట‌ర్ బోర్డు ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు, ఇతరుల వేధింపుల కారణంగా 16 ఏళ్ల సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ నేప‌థ్యంలోనే నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల అఫిలియేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చ‌దువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఫిబ్రవరి 28 రాత్రి స్టడీ అవర్స్ తర్వాత తరగతి గదిలో ఉరివేసుకున్నాడు. ప్రిన్సిపాల్‌తో పాటు మరో ముగ్గురి మానసిక వేధింపుల వల్లే తాను ఈ దారుణానికి ఒడిగడుతున్నానని విద్యార్థి సూసైడ్ నోట్‌లో రాశాడు.

ఆత్మహత్య లేఖ, విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్‌ ఆకలనాకం నరసింహాచారి, తియ్యగురు శివరామకృష్ణారెడ్డి, వార్డెన్‌ కందారబోయిన నరేష్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వొంటెల శోభన్‌బాబులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చదువుల పేరుతో విద్యార్థిని వేధించడం, అవమానించడంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పోలీసులు నలుగురిపై అభియోగాలు మోపారు. ప్రిన్సిపాల్, ఇతరులు అవమానకరమైన పదాలు ఉపయోగించారని, ఇతర విద్యార్థుల ముందు సాత్వైక్‌ను కొట్టారని, దీంతో మానసికంగా కలత చెందాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోజు తల్లిదండ్రులు అతన్ని కలవడానికి కళాశాలకు వచ్చారు. వారు వెళ్లిపోయిన తర్వాత చారి, రామకృష్ణారెడ్డి పరుష పదజాలం ఉపయోగించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. కాగా, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ సోమవారం వివిధ ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. కాలేజీల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలను నియంత్రించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి మించి తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి న‌వీన్ మిట్ట‌ల్ తెలిపారు.

Exit mobile version