Telangana Govt: తెలంగాణ (Telangana Govt) రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలను అందించేందుకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా గ్రామ పరిపాలనాధికారుల (GPO) నియామకం చేపట్టి రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయి వరకు బలోపేతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పత్రాల పంపిణీ
సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైటెక్స్‌లో ఐదు వేల మందికి పైగా కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలనాధికారులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. జీపీవోలుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపిన వీఆర్వో, వీఆర్ఏలకు రెండు విడతల్లో రాత పరీక్షలు నిర్వహించి అందులో 5,106 మంది అర్హత సాధించారని వివరించారు. ఈ నియామకాలతో గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!
గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆవేదన
గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెబితే వినలేదన్న అక్కసుతో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. ఈ చర్య వలన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయి అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా, రెవెన్యూ సేవలను గ్రామ స్థాయి వరకు అందించాలనే లక్ష్యంతోనే గ్రామ పరిపాలనాధికారులను నియమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా చారిత్రాత్మకమైన భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
సర్వే విభాగం బలోపేతానికి చర్యలు
మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వే విభాగాలకు అవినాభావ సంబంధం ఉందని, సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తేనే రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు. గత పదేళ్లలో సర్వే విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో, దీనికి అవసరమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా వచ్చే నెల మొదటి వారం నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మొదటి విడతలో 7,000 మందికి శిక్షణ, అర్హత పరీక్ష పూర్తయ్యాయని, రెండో విడతలో 3,000 మందికి 21 జిల్లాల్లో శిక్షణ ప్రారంభమైందని వివరించారు. ఈ చర్యలన్నీ ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు అందించాలనే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.