Tamilisai Report : ఔను వాళ్లిద్ద‌రూ దూర‌మే! వ‌ర‌ద నివేదిక చిచ్చు!!

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై గ‌ళం విప్పారు. వ‌ర‌ద‌ల్లో ప్ర‌జ‌లకు భ‌రోసా క‌ల్పించ‌డంతో విఫ‌ల‌మైన కేసీఆర్ ప్రొటోకాల్ ను మ‌రిచార‌ని విరుచుకుప‌డ్డారు.

  • Written By:
  • Publish Date - July 25, 2022 / 05:00 PM IST

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై గ‌ళం విప్పారు. వ‌ర‌ద‌ల్లో ప్ర‌జ‌లకు భ‌రోసా క‌ల్పించ‌డంతో విఫ‌ల‌మైన కేసీఆర్ ప్రొటోకాల్ ను మ‌రిచార‌ని విరుచుకుప‌డ్డారు. భ‌ద్రాచలం వ‌ర‌ద బాధితుల వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు అధికారులు దూరంగా ఉన్నార‌ని ఆమె గుర్తు చేశారు. ఇటీవ‌ల హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా రాజ్ భ‌వ‌న్ కు కేసీఆర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి మ‌ధ్యా ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం య‌థ‌త‌దంగా ఉంద‌ని త‌మిళ సై చెప్ప‌డం వివాద‌స్ప‌దం అయింది.

నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం తమిళిసై ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో వరదలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వచ్చాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చార‌ని ఆమె చెప్పారు. ఎప్పుడూ ప్రజలతో ఉండే అల‌వాటు త‌న‌కుంద‌ని వివ‌రించారు. నైతిక బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించాను అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు.

రాజ్భవన్లో సీఎం కేసీఆర్ కలిసిన తర్వాత కూడా తన ప్రొటోకాల్లో మార్పురాలేదన్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటిస్తే కలెక్టర్ కూడా రాలేదని గుర్తు చేశారు. కేసీఆర్ తో ఉన్న ప్రోటోకాల్‌ సంబంధాల్లో ‘స్టేటస్ కో (యథాతథ స్థితి) నే ఉందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో పోల్చుకోనని, గవర్నర్ను కాబట్టి రాజ్ భ‌వ‌న్ కు పరిమితం కావాలని లేద‌ని తమిళి సై వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని తెలిపారు. తోచిన రీతిలో ప్రజలకు సాయం అందిస్తానన్నారు.

తమిళిసై ఢిల్లీలో చేసిన తాజా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గవర్నర్ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఎలా తీసుకుంటారు? ఆమెపై ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే .