Pranahita-Chevella Project: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టు (Pranahita-Chevella Project)ను సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి నేడు ఒక వివరణాత్మక సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు సంబంధించి ‘సుండిళ్ల లింక్’ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేసిందని వెల్లడించారు. ఈ సవరించిన ప్రణాళిక వల్ల ప్రాజెక్టు వ్యయం దాదాపు 10 నుండి 12 శాతం వరకు తగ్గుతుందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా భూసేకరణ కూడా దాదాపు సగానికి తగ్గుతుందని, ఇది మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు రూ.1,500 నుండి 1,600 కోట్ల వరకు ఆదా చేస్తుందని ఆయన వివరించారు.
Also Read: MG M9 Luxury MPV: ప్రముఖ గాయకుడు కొత్త ఎలక్ట్రిక్ లగ్జరీ కారు కొనుగోలు.. ధర ఎంతంటే?
తెలంగాణలోని ఎత్తైన ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురావాలనే అసలు లక్ష్యాన్ని నెరవేర్చడమే కాకుండా సాంకేతిక దృఢత్వం, ఆర్థిక వివేకం, పర్యావరణ బాధ్యతను నిర్ధారించే విధంగా ఈ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ విస్తృత ఉద్దేశ్యమని మంత్రి అన్నారు.
“సవరించిన సుండిల్లా లింక్ ఆచరణాత్మక, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పరిశీలించబడింది. ఇది ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతో పాటు బొగ్గు నిల్వ నిర్మాణాలకు సంబంధించిన మునుపటి సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది” అని మంత్రి అన్నారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
మొత్తంగా రాష్ట్రంలోని రైతులకు, కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
