Free Electricity : పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే ‘గృహ జ్యోతి’’ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చే దిశగా తెలంగాణ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ స్కీమ్‌ను ఇంకా అమలు చెయ్యకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు ఉచిత విద్యుత్ పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్‌ను నిర్వహిస్తోంది. ఇందులోని సమాచారం ప్రకారం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. తెలంగాణలోనూ అదే తరహా పద్ధతిని అమలు చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రత్యేక పోర్టల్‌లో.. ఉచిత విద్యుత్ పొందే అర్హత ఉన్న వారి వివరాలు, కరెంటు కనెక్షన్ల డేటాను నమోదు చేస్తుంది. విద్యుత్ వినియోగదారులు కూడా తమ వివరాలను ఈ పోర్టల్‌లో ఎంటర్ చేయొచ్చు. కర్ణాటకలోనూ ఇలాగే జరుగుతోంది. ఇక్కడా ఇలాగే చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఇంకా చెప్పలేదు. ప్రజలేమో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే డిసెంబరు నెల కరెంటు బిల్లులను చాలా మంది కట్టేశారు. కనీసం జనవరి నుంచైనా పథకం అమలు చేస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు. కనీసం వచ్చే నెలలోనైనా దీనిపై గుడ్ న్యూస్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. వచ్చే నెలలో ఉచిత విద్యుత్ స్కీంతో పాటు రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ పథకాన్ని(Free Electricity) కూడా అమలులోకి తెచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- తెలంగాణలో కోటి 31 లక్షల 48వేల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి.
- రాష్ట్రంలోని 70 శాతం కుటుంబాలు 100 యూనిట్లలోపే కరెంటును వాడుతున్నాయి.
- కోటి 5 లక్షల కుటుంబాలు 200 యూనిట్లలోపే కరెంటును వాడుతున్నాయి.
- డిస్కంలకు ప్రతినెలా రూ.350 కోట్ల విద్యుత్ ఛార్జీలు వసూలు అవుతున్నాయి.
- ఉచిత విద్యుత్ స్కీమ్ అమల్లోకి వచ్చాక.. నెలకు రూ.350 కోట్లు లెక్కన సంవత్సరానికి రూ.4,200 కోట్లను డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- తెలంగాణలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకు రూ.7.07 అవుతోంది.
- విద్యుత్ కంపెనీలు 50 యూనిట్ల వరకూ రూ.1.90, 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.10, 101 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకూ రూ.3.40ను ఇళ్ల నుంచి వసూలు చేస్తున్నాయి.మిగతా మనీని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తూ, డిస్కంలకు చెల్లిస్తోంది.
- గృహజ్యోతి అమలుచేశాక మొత్తం భారం ప్రభుత్వమే భరిస్తుంది.