Miss World: మే 7 నుండి మే 31 వరకు హైదరాబాద్‌లో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను (Miss World) నిర్వహించడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వచ్చిన వాదనలను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సంస్కృతి, వారసత్వ, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈ కార్యక్రమానికి రాష్ట్ర నిధుల వివరాలను వివరించారు.
“మిస్ వరల్డ్, తెలంగాణ టూరిజం మధ్య కాగితంపై సంతకం చేయబడిన ఒక ప్రామాణిక ఒప్పందం ఉంది” అని సభర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమం ఖర్చులో 50 శాతం మాత్రమే భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంటే దాదాపు రూ. 27 కోట్లు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అయితే కొందరు మిస్ వరల్డ్ పోటీలపై చేస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని ఆమె తేల్చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోటీ కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేస్తోందనే నివేదికలను తోసిపుచ్చారు.
Also Read: Rule Change For IPL 2025: ఐపీఎల్‌కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం.. బౌలర్లకు ఇది శుభవార్తే!
ఈ కార్యక్రమానికి ఎక్కువ నిధులు కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌ల నుండి వస్తున్నాయని సభర్వాల్ అన్నారు. “మేము ఎక్కువ డబ్బును స్పాన్సర్ల ద్వారా సేకరిస్తున్నాము” అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 100 కంటే ఎక్కువ కార్పొరేట్, బ్రాండ్ స్పాన్సర్లు ఆసక్తిగా ఉన్నారని ఆమె చెప్పారు. “ప్రభుత్వంపై ఎటువంటి భారం లేదు” అని కూడా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ 2025ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను ప్రశ్నిస్తున్నాయి. అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రజా నిధులను కేటాయించాలా వద్దా అనే దానిపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
సబర్వాల్ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. “గత పదేళ్లలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, హైదరాబాద్ విమానాశ్రయం పరంగా మేము వేగంగా పురోగతి సాధించాము. ఇప్పుడు మా నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆమె అన్నారు. పర్యాటకం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను కూడా ఆమె వివరించారు. మిస్ వరల్డ్ ఈవెంట్ మే 7న ప్రారంభమవుతుంది. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు మే 31న హైదరాబాద్‌లో జరుగుతాయి.