TS Govt: తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ఇవ్వండి!

వరద నష్టాలపై అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసి కేంద్రానికి నివేదించింది.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 12:28 PM IST

రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసి కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1400 కోట్ల వరద నష్టం సంభవించినట్టుగా కేంద్రానికి నివేదికలు అందించింది.  ఈ నేపథ్యంలో రూ.1000 కోట్లను తక్షణ సాయం కింద విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకుపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది.

పంచాయితీ రాజ్ శాఖలో రూ.449 కోట్లు, నీటిపారుదల శాఖలో రూ.33 కోట్లు, పురపాలక శాఖలో రూ.379 కోట్లు, విద్యుత్ శాఖలో రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికలు సిధ్ధం చేసి కేంద్రానికి అందచేసాయి.  అదే సందర్భంలో ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతో పాటు వారిని తరలించే క్రమంలో రూ.25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ.1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు నివేదికలు సిధ్ధం చేసి కేంద్రానికి పంపారు.