TS NEWS : రైతాంగానికి శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్..!!

  • Written By:
  • Updated On - November 23, 2022 / 02:47 PM IST

తెలంగాణ రైతాంగానికి శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు పొందేందుకు, రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రుణ విముక్తి కల్పించనుంది. దీనికి సంబంధించిన వన్ టైం సెటిల్ మెంట్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతులకు ఇది గొప్పఅవకాశమన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

మంగళవారం బ్యాంకర్లతో మంత్రి సమావేశం నిర్వహించిన హ‌రీశ్‌రావ్‌.. వన్ టైం సెటిల్మెంట్ అంశంపై చర్చించారు. గ్రామీణ ప్రాంత రైతుల వ్యవసాయ రుణాలకు సంబంధించిన అన్నీ బ్యాంకులు తప్పకుండా రెన్యూవల్ చేయాలని బ్యాంకర్లకుమంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు.

ముంపునకు గురైన రైతుల భూములకు సంబంధించిన రుణాల విషయంలో బ్యాంకులు ప్రత్యేకంగా పథకాలు రూపొందించి.. వారికి రుణవిముక్తి కల్పించేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ, టీజీబీ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు రుణ విముక్తి కలుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. పలు బ్యాంకుల నుంచి ఓటీఎసీ స్కీం కింద 12శాతం నుంచి 50శాతం వరకు మొండి బకాయిలు, క్రాప్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేనివారు వారిని నాలుగు బ్యాంకుల నుంచి వన్ టైం సెటిల్ మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.