Liquor Rates: మద్యం విషయంలో ఏపీ స్కెచ్ నే ఫాలో అవుతున్న తెలంగాణ..

  • Written By:
  • Publish Date - March 12, 2022 / 09:50 AM IST

తెలంగాణలో ప్రభుత్వం, విపక్షాల మధ్య మద్యం వార్ నడిచింది. ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న మాటలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంతకీ శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే.. మద్యం ధరలు తగ్గిస్తే.. ప్రజలు ఛాయ్ తాగడం మానేసి మద్యం తాగుతారని చెప్పారు. అదే ధరలు ఎక్కువగా ఉంటే.. మద్యం తాగడం గురించి కాకుండా.. ఇంటి ఖర్చులపై దృష్టి పెట్టి వినియోగం తగ్గిస్తారని అన్నారు.

శ్రీనివాస్ గౌడ్ చెప్పిన ఈ మద్యం లెక్కపై పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే మద్యం రేట్లను ఎక్కువగా పెట్టడం కూడా నిషేధంలో ఓ భాగమే అని ఆయన అన్నారు. శాసనసభలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ పద్దులపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. ఇక రాష్ట్రంలో మద్య నిషేధం విషయంలో మాత్రం మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీనికి ఆయన ఓ లాజిక్ కూడా చెప్పారు.

దేశవ్యాప్తంగా మద్యనిషేధాన్ని అమలు చేస్తే.. తెలంగాణలోనూ దానిని ఫాలో అవుతామని కేసీఆర్ చెప్పారంటూ శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ఒకవేళ దేశంలో నిషేధం లేకుండా కేవలం రాష్ట్రంలోనే విధిస్తే చిక్కులు తప్పవు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్ముతున్నప్పుడు అక్కడి నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం సరఫరా అయ్యే ఛాన్సుంది. అంటే అప్పుడు మధ్య నిషేధం పెట్టీ ప్రయోజనం లేదన్నది మంత్రిగారి అభిప్రాయం.

తెలంగాణ సర్కారు మద్యం ద్వారానే రూ.37 వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే.. మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని కూడగట్టాలని అనుకోవడం లేదని.. నిజానికి అక్రమ మద్యాన్ని అడ్డుకోవడం వల్లే ఆదాయం పెరిగిందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ ఏది ఏమైనా తెలంగాణ సర్కారు మాత్రం మద్యం రేట్ల విషయంలో ఏపీ ఫార్ములానే ఫాలో అవుతోందని అర్థమవుతోంది.