TG High Court : తెలంగాణ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కృత్రిమమేధ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది. 400 ఎకరాల భూ వివాదంలో నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్ తయారు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొంది.
Read Also: Fact Check: కంచ గచ్చిబౌలిలో భూసేకరణ.. రోడ్లపైకి సింహాలు ?
ఇటీవలే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు ఫేక్ ఫొటో, వీడియోలు క్రియేట్ చేశారని పిటిషన్ లో వివరించారు.
సర్వే నెంబర్ 25 లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్‌లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారు. వాటిని నిర్మించే సందర్భాల్లో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు , ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Read Also: LPG cylinder price Hike : దేశ వ్యాప్తంగా గ్యాస్ ధరలు పెంపు