Female Lineman: తెలంగాణకు తొలి మహిళా లైన్‌మెన్ ఈమె..!

తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో తొలి మ‌హిళా జూనియర్ లైన్ మెన్ గా నియామ‌క‌మైన‌ బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించింది.

  • Written By:
  • Updated On - May 12, 2022 / 04:58 PM IST

తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో తొలి మ‌హిళా జూనియర్ లైన్ మెన్ గా నియామ‌క‌మైన‌ బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించింది. బుధవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష మేడ్చల్ మల్కాజిగిరిలో తన చదువును అభ్యసించింది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో జేఎల్‌ఎం పోస్టుకు ఇటీవల జరిగిన రిక్రూట్‌మెంట్‌లో ఆ పోస్టును దక్కించుకున్న ఏకైక మహిళ గా ఈమె నిలిచింది. రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థల్లో కూడా ఆమె ఒక్కరే పదవిలో ఉన్నారు.

తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ట్రాన్స్‌కో)లో జేఎల్‌ఎం పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో 200 మంది మహిళలను నియమించింది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో జేఎల్ఎమ్‌ పోస్ట్‌కి ఎంపికైన మొదటి మహిళ కావడం గర్వకారణం. స్త్రీలు పురుషుల కంటే తక్కువేమీ కాదని, అన్ని రంగాల్లో రాణించగలరని ఈ పదవికి త‌న‌ ఎంపిక నిరూపిస్తోందని శిరీష తెలిపింది. త‌న‌కు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ర‌ఘురామ‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో మహిళలు కొత్త బాటలో పయనిస్తూ జేఎల్‌ఎం పోస్టులో నియామకాలు చేపట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. లైన్‌మెన్‌ పోస్టుల్లో మహిళలను కూడా నియమిస్తున్నందున గతంలో సూచించిన విధంగా లైన్‌మెన్‌ పోస్టుల నామకరణాన్ని మార్చి లింగభేదం లేకుండా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎస్‌పిడిసిఎల్‌లో 70 అసిస్టెంట్ ఇంజనీర్లు, 201 సబ్ ఇంజనీర్లు, 1,000 లైన్ మెన్ పోస్టుల భర్తీ ఇప్పటికే ప్రారంభమైంది. వివిధ పదవుల్లో మహిళలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించారు. కాగా, డిస్కమ్‌లు నష్టపోకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన విధంగా నెలవారీ చెల్లింపులు చేస్తోందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోందని, ఇతర రాష్ట్రాలు విద్యుత్ కోత విధిస్తున్నాయని ఆయన అన్నారు.