సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ

అధికారిక విదేశీ పర్యటన పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగతంగా వెళ్లారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ‘తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం’ అనే శీర్షికతో ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వివరణ ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reddy

CM Revanth Reddy

. సోషల్ మీడియాలో సాగుతున్న ఆరోపణలు నిరాధారమే

. ముఖ్యమంత్రి న్యూయార్క్ పర్యటన పూర్తిగా అధికారికమే

. ఎంఈఏ మార్గదర్శకాల ప్రకారమే అన్ని ఏర్పాట్లు

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం కఠినంగా స్పందించింది. అధికారిక విదేశీ పర్యటన పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగతంగా వెళ్లారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ‘తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం’ అనే శీర్షికతో ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని దురుద్దేశంతోనే కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అధికారికంగా ఆమోదించబడిన పర్యటనకు సంబంధించిన వాస్తవాలను తప్పుదారి పట్టించి ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నమే ఇది అని ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూయార్క్ పర్యటన పూర్తిగా అధికారికమేనని అన్ని నిబంధనలు విధివిధానాలకు అనుగుణంగా సమన్వయంతో నిర్వహించబడిందని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ఈ విదేశీ పర్యటనను ముందుగానే అధికారికంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా సకాలంలో పొందినట్లు వెల్లడించింది. దావోస్ నుంచి అమెరికాకు చేరుకున్న అనంతరం న్యూయార్క్ విమానాశ్రయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికారులు ముఖ్యమంత్రికి అధికారికంగా స్వాగతం పలికారని తెలిపింది. ఇది ఈ పర్యటనకు ఉన్న అధికారికతకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొంది.

న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి ప్రయాణానికి ఎంఈఏ అధికారిక వాహనాన్ని ఏర్పాటు చేసిందని ఇది సాధారణ దౌత్య ప్రక్రియలో భాగమేనని ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరించింది. శీతాకాలంలో తీవ్ర మంచు తుపానుల హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో విమాన ప్రయాణం చేయవద్దని ఎంఈఏ ముఖ్యమంత్రికి సూచించిందని తెలిపింది. అదే సూచనల మేరకు న్యూయార్క్ నుంచి బోస్టన్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణాన్ని ఎంఈఏనే పూర్తిగా ఏర్పాటు చేసిందని వెల్లడించింది. ఈ ప్రయాణంలో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌కు వెళ్లే కార్యక్రమం కూడా ఉందని పేర్కొంది. ఉన్నత స్థాయి విద్యా సంస్థలతో సంబంధిత కార్యక్రమాలపై పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నందున ఈ కాలంలో ముఖ్యమంత్రి తన కార్యక్రమాలను ఉద్దేశ్యపూర్వకంగా నిరాడంబరంగా నిర్వహించారని ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి బాధ్యతారహితమైనవి మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది.

  Last Updated: 26 Jan 2026, 08:42 PM IST