Telangana Cash Crunch : సంప‌న్న తెలంగాణ‌కు ‘ఆర్థిక’ కష్టాలు!

ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ప‌డిపోయింది. సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌కాలంలో అమ‌లు చేయ‌లేక‌పోతోంది.

  • Written By:
  • Updated On - May 31, 2022 / 01:05 PM IST

ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ప‌డిపోయింది. జీతాలు, పెన్ష‌న్లతో రైతు బంధు త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌కాలంలో అమ‌లు చేయ‌లేక‌పోతోంది. వాస్తవిక‌ ఆదాయ వ్యయాల మధ్య సమతూకం పాటించడంలో కేసీఆర్ స‌ర్కార్ క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పింది. ఆ విష‌యాన్ని కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాతో పాటు 15వ ఆర్థిక సంఘం స్ప‌ష్టం చేసింది. రుణాల‌ను కూడా ఆదాయంగా చూపుతూ అభివృద్ధి గణాంకాలను పెంచే ప్ర‌య‌త్నం తెలంగాణ ప్ర‌భుత్వం చేసింద‌ని ఆర్థిక వేత్త‌లు, విప‌క్ష‌నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఆర్థిక త‌ప్పిందాల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం కేసీఆర్ స‌ర్కార్ చేయ‌డంలేదు. పైగా తప్పుడు వృద్ధి గణాంకాలను ప్రొజెక్ట్ చేసిన కార‌ణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాజా రుణాలు తీసుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. ఆ విష‌యాన్ని మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాముఖంగా వెల్ల‌డించారు. ఆర్‌బీఐ నిషేధం తెలంగాణను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వాన్ని నడపడానికి నిధులు అవ‌స‌రం. ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఆర్బీఐ ఆపివేసిన క్ర‌మంలో రైతు బంధు ఇతర సంక్షేమ పథకాలను అమ‌లు చేయ‌డానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. ఆర్థిక నిపుణులతో సమావేశం నిర్వహించి తక్షణ పరిష్కారం కనుగొనాల‌ని సీఎంను విప‌క్ష నేత‌లు కోరుతున్నారు. ఆర్థిక సంక్షోభం ముఖ్యంగా వ్యవసాయంపై ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని హుజూరాబాద్‌ అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్త‌మ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తప్పుగా నిర్వహించడం వల్ల వచ్చే పంట సీజన్‌లో రైతు బంధు లబ్ధిదారుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సేకరించడం కష్టంగా ఉంది. ఆర్బీఐ, 15వ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్ర‌కారం తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఇప్ప‌ట్లో అవ‌కాశం లేదు. పైగా రుణాల‌ను తీసుకోవ‌డానికి ఆర్బీఐ అనుమ‌తి నిరాక‌ర‌ణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప‌రిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితికి త‌గిన విధంగా అప్పులు చేశామ‌ని అధికార ప‌క్ష లీడ‌ర్లు చెబుతున్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే, రుణాల‌ను తీసుకున్నామ‌ని అధికాప‌క్షం వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ, విప‌క్షాలు మాత్రం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశార‌ని, ఇప్ప‌ట్లో ఇక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం సాధ్యం కాద‌ని చెబుతున్నారు. ఉద్యోగుల‌కు జీతాల‌ను స‌కాలంలో ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో తెలంగాణ స‌ర్కార్ ఉంద‌ని ప్ర‌తిప‌క్షం చెబుతోంది. అందుకు త‌గిన విధంగా కేంద్ర ఆర్థిక సంస్థ‌ల నివేదిక‌లు కూడా ఉండ‌డంతో ప్ర‌మాద‌ర ప‌రిస్థితుల్లోకి తెలంగాణ ఆర్థికం వెళ్లింద‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా. భ‌విష్య‌త్ లో కేసీఆర్ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.