ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్షల కార్యక్రమంగా చెప్పుకునే కంటి వెలుగు (Kanti Velugu) రెండో దశ కింద తెలంగాణ (Telangana) ఆరోగ్యశాఖ అధికారులు కోటి మందికి పైగా ప్రజలకు ఉచిత కంటి పరీక్షలను అందించారు. జనవరిలో రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి 1,500 వైద్య బృందాల ద్వారా 1,01,65,529 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 47,70,757 మంది పురుషులు, 53,85,293 మంది మహిళలు, 3,360 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. లక్ష్యంలో 64.07 శాతం సాధించినట్లు అధికారులు తెలిపారు.
రెండవ దశ 1.5 కోట్ల మంది ప్రజలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 16.33 లక్షల మందికి ఉచితంగా రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 12.31 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం కేటాయించారు. దాదాపు 73 లక్షల మందికి కంటి సమస్యలు లేవని నిర్ధారించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆలోచనలో భాగంగా 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి దశలో కోటి మందిని పరీక్షించారు.
రెండవ దశను జనవరి 18న ఖమ్మంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా సమక్షంలో చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. కేజ్రీవాల్, విజయన్ తమ తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. పట్టణాలలోని ఆసుపత్రులకు వెళ్లకుండా ఉచితంగా పరీక్షలు చేస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు శిబిరాలతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల వారీగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణలో ప్రజాప్రతినిధులు, అధికారులు చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజలు సకాలంలో కంటి వెలుగు శిబిరాలకు చేరుకునేలా ముందస్తు అవగాహన కల్పిస్తూ శిబిరాల విజయవంతానికి కృషి చేస్తున్నారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి అయ్యే ఖర్చుతో భయపడే వారికి ఈ కార్యక్రమం వరంగా మారింది.