తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల అమలుకు ఆసక్తి చూపుతోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం BOOT విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఆహ్వానం పంపింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించారు. అక్కడి SELI (400 MW) మరియు MIYAR (120 MW) జలవిద్యుత్ ప్రాజెక్ట్ ప్రాంతాలను పరిశీలించి, 100 మెగావాట్లకు పైబడిన ప్రాజెక్టులపై ఆసక్తి చూపాలని సిఫారసు చేశారు.
Tour Tips : ఏపీలోని ఈ హిల్ స్టేషన్ విశ్రాంతి కోసం ఉత్తమమైనది.. విశాఖపట్నం నుండి 111 కిమీ దూరంలోనే..!
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శితో కలిసి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ సుఖు తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం SELI (400 MW) మరియు MIYAR (120 MW) ప్రాజెక్టులపై అధికారికంగా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక ప్రాథమిక ఒప్పందం (MoU) ముసాయిదా పంపాలని అభ్యర్థించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి పరిశీలన చేసి, వీలైనంత త్వరగా ఒప్పందం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ అవసరాలు తీర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో పెరుగుతున్న డిమాండ్‌ను సమర్ధంగా తీర్చేందుకు మార్గం సుగమం కానుంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ పవర్ ఉత్పత్తిని మెరుగుపరుచుకోవడంతో పాటు, నూతన జలవిద్యుత్ ప్రాజెక్టుల విస్తరణకు మార్గదర్శకంగా నిలుస్తుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం, రాష్ట్రంలో స్థిర విద్యుత్ సరఫరా లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది.