Site icon HashtagU Telugu

KTR : నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: కేటీఆర్‌

Telangana EX-Minister KTR Press Meet At Hyderabad

Telangana EX-Minister KTR Press Meet At Hyderabad

Free bus travel for women : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై చేసిన వ్యాఖ్యలకు నేడు మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో కమిషన్‌కు ఏం చెప్పారో వివరణ ఇచ్చారు. కాగా, మహిళలపై వ్యాఖ్యలకు గాను మహిళ కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్‌ ఆఫీసుకు వచ్చారు. వివరణ ఇచ్చిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ..’నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను. ఇదే విషయాన్ని మహిళా కమిషన్‌ ముందు కూడా చెప్పాను. కమిషన్‌ ఎదుట క్షమాపణ కూడా కోరాను. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పొరపాటు జరిగినప్పుడు జరిగిందని ఒప్పుకోవాలి. అంతేకానీ, మా మీద పడటం, దాడి చేయడం(​కాంగ్రెస్‌ మహిళా నేతలను ఉద్దేశించి) మంచిది కాదన్నారు. అలాగే, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను కూడా మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాం’ అని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మహిళా కమిషన్‌ ముందు వివరణ ఇచ్చేందుకు ఆఫీసుకు కేటీఆర్‌ వస్తున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్‌ నేతలు కమిషన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం, మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు కేటీఆర్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక, అదే సమయంలో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. అనంతరం, కమిషన్‌ ఆఫీసులోకి కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దూసుకెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.

మరోవైపు మహిళా కమిషన్ ఎదుట హాజరై..వివరణ ఇచ్చేందుకని కేటీఆర్‌ వస్తే.. మహిళా కమిషన్ సభ్యులు పోటీలు పడి మరీ రాఖీలు కట్టడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. విచారణకు పిలిచి కేటీఆర్‌కు రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని మహిళా కమిషన్ సభ్యులు చాటుకున్నారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవేనని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంలో మంత్రి సీతక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కొంతమంది చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటామని అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. మహిలలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మహిళల గురించి వివాదాస్పద కామెంట్స్ చేశారని మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీస్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ కేటీఆర్ మహిళ కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన క్షమాపణ చెప్పారు. యథాలాపంగా అన్నవే తప్పా మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read Also: Renault Triber: అతి త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే 7 సీట‌ర్ కారు ఇదే..!