TS Employees: హామీల అమ‌లేది? శాల‌రీ పెరిగేదెప్పుడు? తెలంగాణ‌లో ఉద్యోగుల ఆందోళ‌న‌

వేత‌నాల పెంపు, ఇతర స‌మ‌స్యల ప‌రిష్కారంపై అసెంబ్లీతోపాటు ఇతర వేదిక‌ల‌పై ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని తెలంగాణ ఉద్యోగులు ముఖ్యమంతి కేసీఆర్‌ను కోరుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 23, 2022 / 07:42 AM IST

వేత‌నాల పెంపు, ఇతర స‌మ‌స్యల ప‌రిష్కారంపై అసెంబ్లీతోపాటు ఇతర వేదిక‌ల‌పై ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని తెలంగాణ ఉద్యోగులు ముఖ్యమంతి కేసీఆర్‌ను కోరుతున్నారు. పీఆర్‌సీ అమ‌లు కాక‌పోవ‌డం, నూత‌న జోన‌ల్ వ్యవ‌స్థ కార‌ణంగా బ‌దిలీల్లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో వారిలో అసంతృప్తి పెరిగింది. వీటిపై ఆందోళ‌న చేస్తామ‌ని చెబుతున్న నాయ‌కులు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ప‌రిణామాల‌ను గుర్తుచేస్తున్నారు.

త‌మ‌కు పేస్కేల్‌ ఫిక్స్ చేయాల‌ని డిమాండు చేస్తూ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ హైద‌రాబాద్‌లో మ‌హా ధ‌ర్నా చేశారు. వీరికి విప‌క్షాలు మ‌ద్దతు తెలిపాయి. మ‌రోవైపు పీఆర్‌సీ రిక‌మండేష‌న్స్ అమ‌లు కాక‌పోవ‌డంపైనా అసంతృప్తి నెల‌కొంది. 30 శాతం ఫిట్మెంట్ ఇస్తామ‌ని చెప్పి, వాటిని 2018 జులై నుంచి అమ‌లు చేస్తామ‌ని ప్రభుత్వం ప్రక‌టించింది.

పెరిగిన జీతాల‌ను వెంట‌నే న‌గ‌దు రూపంలో కాకుండా, త‌రువాత ఎప్పుడో బ‌కాయిల రూపంలో చెల్లిస్తామ‌ని చెప్పడంతో ఉద్యోగులు పెద‌వి విరుస్తున్నారు. ఆ బ‌కాయిల‌ను కూడా కొద్ది కొద్దిగా వాయిదాల రూపంలో ఇస్తుండ‌డంతో పెద్దగా ప్రయోజ‌నం ఏమీ క‌నిపించ‌డం లేద‌న్న అభిప్రాయం నెల‌కొంది. జోన‌ల్‌, మ‌ల్టీ జోన‌ల్ వ్యవ‌స్థల‌పై ఇప్పటికీ క్లారిటీ రాక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్యగా మారింది.

బ‌దిలీల‌పై ఆర్డర్లు ఇవ్వడం, వాటిని మళ్లీ ర‌ద్దు చేయ‌డం కూడా వారిలో అసంతృప్తి క‌లిగిస్తోంది. వీట‌న్నింటినీ గ‌మ‌నిస్తున్న విప‌క్షాలు.. నిరుద్యోగుల‌నే కాదు.. ఉద్యోగుల‌ను కూడా మోస‌గిస్తోందంటూ ప్రభుత్వాన్ని విమ‌ర్శిస్తున్నాయి. రానున్న రోజుల్లో వీటిపై ఉద్యమిస్తామ‌ని చెబుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం జాతీయరాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందని.. అందుకే రాష్ట్రంలో సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.