Site icon HashtagU Telugu

Pharma Hub: ఫార్మాలో తెలంగాణ టార్గెట్ 100 బిలియన్ డాలర్లు.. కేటీఆర్ కు బిల్ గేట్స్ ప్రశంసలు

Bio Asia Imresizer

Bio Asia Imresizer

100 బిలియన్ డాలర్లు. ఫార్మా రంగంలో వచ్చే ఎనిమిదేళ్లలో తెలంగాణ టార్గెట్ ఇదే. భ‌విష్యత్తులో ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌లో అంత‌ర్జాతీయ త‌యారీ కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేయాల్సిందే అన్న పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసమే మంత్రి కేటీఆర్ పక్కా స్కెచ్ తో అడుగులేస్తున్నారు. మరిన్ని అంతర్జాతీయ పరిశ్రమలను ఆహ్వానిస్తే.. ఈ ఆశ, ఆశయం అతి త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది.

ఇప్పటికే హైద‌రాబాద్ లో చాలా ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ తో పాటు చుట్టుప‌క్కల ఉన్న ఈ ప‌రిశ్రమ‌లు మ‌రింత‌గా విస్తరించ‌నున్నాయి. ఫ్యూచ‌ర్ రెడీ పేరుతో వ‌ర్చువ‌ల్ విధానంలో బయో ఆసియా సదస్సు కూడా జరిగింది. ఈ సదస్సుకు బిల్ గేట్స్ వచ్చారంటేనే దీని ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతోంది. అందుకే కేటీఆర్ కూడా ప్రభుత్వం అనుసరించబోయే వ్యూహం ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ఇప్పటికే ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పుడు బిల్ గేట్స్ కూడా అదే పనిచేశారు. ప్రభుత్వ విజన్ ఆయనకు నచ్చింది. అందుకే కచ్చితంగా హైదరాబాద్ వస్తానన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన తయారీదార్లకు థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత ఉందని.. దానికోసమైనా వస్తానన్నారు. కరోనా వల్ల రెండేళ్లుగా ఎక్కడికీ వెళ్లని బిల్ గేట్స్.. ఇప్పుడు హైదరాబాద్ కు వస్తానన్నారు అంటేనే ఆయన ఈ సిటీకి, ఇక్కడి విధానాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం అవుతుంది.

ఫార్మా రంగం కాని ఇంకా అభివృద్ధి చెందితే.. భవిష్యత్తులో టీకాల తయారీ హబ్ గా తెలంగాణయే అవుతుందన్నారు బిల్ గేట్స్. దీనిని బట్టి తెలంగాణ విషయంలో బిల్ గేట్స్ విజన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే 250 కంపెనీలు రూ.6,400 కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్టాయి. ఒక్క ఏడాదిలోనే 34 వేల ఉద్యోగాలను కల్పించారు. 2030 నాటికి 4 ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పించాల‌న్న తెలంగాణ ప్రభుత్వ టార్గెట్ కోసం మంత్రి కేటీఆర్ పెద్ద ప్లాన్ నే తయారుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడానికి భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుతోపాటు పర్యావరణాన్ని కాపాడేలా సర్కారు విధానాలు ఉన్నాయి. అందుకే ప‌రిశ్రమ‌లు రావ‌డానికి ఆస‌క్తి చూపుతున్నాయి. అన్నీ సక్రమంగా అమలైతే.. త‌క్కువ ధ‌ర‌కే నాణ్యమైన మందులు అందించ‌డానికి అవకాశం ఉంది.