Bhatti Vikramarka : తెలంగాణలో విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం (జూన్ 18) ఖమ్మంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగానికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలను వెల్లడించారు.
డిప్యూటీ సీఎం పేర్కొన్న ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉపయోగిస్తున్న 29 లక్షల పంపు సెట్లకు ప్రతి సంవత్సరం రూ. 11,500 కోట్లు చెల్లిస్తోంది ప్రభుత్వం. అలాగే ప్రజలకు ఉచితంగా అందిస్తున్న 200 యూనిట్ల విద్యుత్ పథకం కింద 5 లక్షల 70 వేల 132 కుటుంబాలకు రూ. 2,293 కోట్లు చెల్లించామని వెల్లడించారు. అంతేకాక, రాష్ట్రంలోని 29,018 విద్యా సంస్థలకు రూ. 198 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వం 13,992 కోట్ల రూపాయలు విద్యుత్ సబ్సిడీ కింద ఖర్చు చేసినట్లు తెలిపారు.
విపక్షాలు కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అవుతుందంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన భట్టి విక్రమార్క, “కాంగ్రెస్ అంటేనే కరెంట్… కరెంట్ అంటేనే కాంగ్రెస్,” అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కొత్త విద్యుత్ ఉత్పత్తి సంస్థను కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగలిగిందని చెప్పారు. “రాష్ట్రంలో ఎక్కడా నిమిషం కూడా కరెంట్ కట్ అవకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం,” అని భట్టి స్పష్టం చేశారు. 2030 నాటికి 33,773 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, దానికి అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రూ. 1.80 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నామని వెల్లడించారు.
విద్యుత్ ఉద్యోగుల భద్రత కోసం త్వరలో విద్యుత్ అంబులెన్స్‌లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ వాహనాల్లో అవసరమైన రక్షణ సామగ్రి అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఎదురైతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.