Site icon HashtagU Telugu

Telangana Assembly Elections: ఈరోజుతో మూగబోతున్న మైకులు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్

All Parties

All Parties

Telangana Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ దగ్గరికి వచ్చింది. ఇవాళ ఒక్కరోజే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. ఈనెల 28 వరకే పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని ఈసీ ముందే స్పష్టం చేసింది. ఈనెల 30న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 29న ఎలాంటి ప్రచారం చేయకూడదు. దీంతో పార్టీల నాయకుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. గత కొన్ని రోజుల నుంచి అలుపు లేకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు భారీ స్థాయిలోనే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి గత 20 రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ప్రతి నియోజకవర్గంలో సభ నిర్వహించి కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయొద్దో.. మళ్లీ బీఆర్ఎస్ కు ఎందుకు వేయాలో ప్రజలు వివరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. జాతీయ నాయకులనే రంగంలోకి దించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే లాంటి వాళ్లు ప్రచారం చేశారు.

బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా రంగంలోకి దిగి.. తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇలా ఎవరికి వారు తెలంగాణ ప్రజల మద్దతు కోసం తమ వ్యూహాలు అమలు చేశారు. ఏది ఏమైనా.. ఇవాళ ఒక్క రోజు మాత్రమే ఇక ప్రచారానికి సమయం ఉంది. ఈనేపథ్యంలో పార్టీలన్నీ ఈ ఒక్క రోజు కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లోనే ఉండి ప్రజల మద్దతును కోరనున్నాయి.