Site icon HashtagU Telugu

Telangana Election Campaign : ప్రచారం ముగిసింది.. అంచనాలు మొదలయ్యాయి..

Telangana Election Campaign Is Over.. The Expectations Have Started..

The Campaign Is Over.. The Expectations Have Started..

Telangana Election Campaign is Over : ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చివరి రాష్ట్రంగా తెలంగాణలో ప్రచార ఘట్టం ముగిసింది. ఇక ఎవరి అంచనాలు వారు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసేంతవరకు ఓటర్ ను ప్రభావం చేసే ప్రక్రియ ఎవరూ సాగించకూడదు. ప్రచారం ముగిసిన ఘడియ నుంచి పోలింగ్ ముగిసే వరకు రాజకీయ పార్టీలే కాదు మీడియా కూడా ఏ రూపంలోనూ వోటర్ లను ప్రభావం చేసే డిబేట్లు గాని, సర్వేలు గానీ, విశ్లేషణలు గానీ చేయకూడదు. ఇది సోషల్ మీడియాకి కూడా వర్తిస్తుంది. అయితే మీడియాలో చర్చోప చర్చలు సాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎవరికి వారు ప్రకటిస్తూనే ఉన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ (Telangana)లో ముక్కోణపు పోటీ జరుగుతుంది. అంతేగాక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. కర్ణాటక ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో పెరిగిన నూతనోత్తేజం తెలంగాణలో విజయాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతున్నదా లేదా అనేది కీలకం.

We’re Now on WhatsApp. Click to Join.

మన ఇష్టాయిష్టాలతో ఎన్నికల ఫలితాలు ఉండవు. సామాన్య ప్రజలు ప్రభుత్వ వర్గాల నుంచి గాని ప్రతిపక్ష పార్టీల నుంచి గాని కోరుకునేది ఏమిటి అనే దానిపైనే జయాపజయాలు నిర్ణయించబడతాయి. జాతీయస్థాయి రాజకీయాల ప్రభావం రాష్ట్రస్థాయి రాజకీయాలలో ఉంటుందా అనేది ఒక ప్రశ్న. సాధారణంగా రాష్ట్రంలో ప్రజలు స్థానిక సమస్యల మీద, రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టనష్టాల మీద, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీద ఒక అంచనాకి వస్తారు. అందుకే తెలంగాణ (Telangana)లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వెనుక బెంచీ మీదకు వెళ్ళిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందు బెంచీ మీదకు వచ్చింది. అధికార బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కి ప్రత్యక్ష పోరాటం ఖరారైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసిన పథకాలు, ఇక ముందు అమలు చేస్తామని చెబుతున్న మరిన్ని హామీలు, అలాగే ప్రతిపక్షం చేస్తున్న పథకాల వాగ్దానాలు.. ఇవన్నింటిని బేరీజు వేసుకొని ఓటరు ఏ పక్షం తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాడు.

ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మూడోసారి అధికారం కట్టబెట్టాలా, లేక తెలంగాణ (Telangana) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలా అనేది తెలంగాణ ఓటర్ మదిలో పెద్ద సంఘర్షణగా మారింది. ఈ సంఘర్షణ ఫలితం ఎటు మొగ్గుచూపితే విజయం అటే నడుస్తుంది. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత ప్రజల్లో గూడు కట్టుకోవడం సాధారణమైన విషయమే. ఆ వ్యతిరేకత ఏయే అంశాల మీద ఉంది, ఎంత మేరకు ఉంది అనేదే కీలకం. అంతకు ‘ ముందు కాంగ్రెస్ 60 ఏళ్ళు పరిపాలించింది, మేము పదేళ్ళే పరిపాలించాము, ఈ పదేళ్ల కాల అభివృద్ధి చూసి ఓటేయండి’ అని అధికార పార్టీ అడుగుతుంది. ప్రజలు అంత చరిత్ర లోతుల్లోకి వెళ్తారా? రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారా అనేది కూడా కీలకమే.

Also Read:  CBN : డిసెంబర్ 1న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోనున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు

ఏది ఏమైనా ప్రతిపక్షాల కంటే చాలా ముందుగా ప్రచారాన్ని ప్రారంభించి దాదాపుగా సిటింగ్ ఎమ్మెల్యేలను తిరిగి కొనసాగించి, రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్న కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టే అవకాశం ప్రజలు ఇస్తారా, లేక ఆయనే చెప్పినట్టు ఇక మీకు విశ్రాంతి కావాలి ఫామ్ హౌస్ ఎలాగూ ఉంది కదా హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్తారా.. ఏ విషయం తేలడానికి ఇంక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.

డబ్బే ప్రధాన అంశమా?

పార్టీలు తమ ప్రచారంలో చేసిన వాగ్దానాలు, వల్లించిన పథకాల పాఠాలు, ఓటర్లను ఆకర్షించే విశేషాలు అన్నీ పక్కకు పోయి, ప్రచారం ముగిసిన తర్వాత ఆ 36 గంటల్లో ఏం జరుగుతుందనేదే పెద్ద ఆసక్తికరమైన అంశం. దేశంలో ఎక్కడా లేనంత డబ్బు పంపిణీ తెలంగాణ (Telangana)లో జరుగుతుందని, ఇంతకు ముందు జరిగిన మునుగోడు ఎన్నికల్లో మనకు తెలిసింది. ఇప్పుడు కూడా వేలకోట్లు అనేక చోట్ల డంప్ చేసినట్లు, ఓటుకి దాదాపు 3000 పైగా పంచడానికి నాయకులు డబ్బు సంచులతో రెడీగా ఉన్నట్లు అనేక వార్తలు అందుతున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి గోయల్ ఇంట్లోనే వందల కోట్లు నగదు దొరికినట్టు కూడా సమాచారం. అలా నగదు డంపు చేసిన సీక్రెట్ స్థావరాలు చాలా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు సంచలనమయ్యాయి. మిగిలిన ఈ 24 గంటల్లో ఎంత డబ్బు పంపిణీ అవుతుందో ఎంత మద్యం ఏరులై పారుతుందో చెప్పలేం.

భారతదేశాన్ని విశ్వ గురువుగా, భారత ప్రజాస్వామ్యాన్ని అత్యున్నత ప్రజాస్వామ్యంగా అభివర్ణిస్తున్న నాయకులు ఈ పరిణామానికి ఏ విధంగా అర్థం చెప్తారో చూడాలి. తాము చేసిన పనులు అంత గొప్పవైతే డబ్బు పంపిణీ అవసరం ఎవరికి మాత్రం ఎందుకు ఉంటుంది? ప్రజలను పథకాల ద్వారా బిచ్చగాళ్లుగా చేసి, డబ్బు పంపిణీ ద్వారా నోటుకు అమ్ముడుపోయే అసహాయుల్ని చేసి ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ పటిష్టం చేయాలనుకుంటున్నారో నాయకులే చెప్పాలి.

ఏది ఏమైనా పరిణామాలు ఎలా ఉన్నా.. ఎన్నికల్లో నగదు, మద్యం ఎంత విచ్చలవిడిగా రంగ ప్రవేశం చేశాయో చూస్తే అదంతా సమస్త ప్రజాస్వామిక వాదులకు తీవ్రంగా మనస్తాపం కలిగించే విషయమే.

Also Read:  Vizag : వైజాగ్‌లో హోట‌ల్స్‌పై విజిలెన్స్ అధికారుల త‌నిఖీలు.. నిల్వ ఉంచిన ఆహారాన్ని..?