Site icon HashtagU Telugu

Gutha Sukender Reddy : సామాజిక, ఆర్థిక సర్వేపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వేను చారిత్రాత్మకంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు. 97 శాతం ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారని, ఇది ప్రజల సహకారంతో విజయవంతంగా పూర్తయిందని అన్నారు. అయితే, కొంత మంది రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సర్వేను తప్పుబడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాతో సర్వేను పోల్చడం సరికాదని పేర్కొంటూ, ప్రభుత్వ డేటా ఆధారంగా ప్రజల వివరాలు సేకరించడమే ఈ సర్వే లక్ష్యమని తెలిపారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం. ఇందులో 97 శాతం ప్రజలు పాల్గొన్నారు. అయినప్పటికీ, కొంతమంది నేతలు దీనిని అసలు సర్వే కాదని విమర్శించడం సమంజసం కాదు. ఓటర్ల జాబితాతో ఈ సర్వేను పోల్చడం అసలు తగదు. ఎందుకంటే, ఓటర్ల నమోదులో డూప్లికేట్ ఎంట్రీలు, పలు ఇతర సాంకేతిక సమస్యలు ఉంటాయి. దీంతో లెక్కల్లో తేడా రావొచ్చు. కానీ, ఈ సర్వే పూర్తిగా అధికారికమైనది, ప్రభుత్వ ప్రయోజనాల కోసమే దీనిని నిర్వహించారు” అని స్పష్టం చేశారు.

2014లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే గురించి ప్రస్తావిస్తూ, “ఆ సర్వేను అధికారికంగా ప్రవేశపెట్టలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే పూర్తిగా పారదర్శకంగా కొనసాగింది. ప్రతీ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” అని గుత్తా పేర్కొన్నారు.

 Rahul Gandhi: అకస్మాత్తుగా వరంగల్‌కు రాహుల్‌గాంధీ .. కారణం ఏమిటి ?

రైతు భరోసా నిధుల విడుదలపై విజ్ఞప్తి
సర్వేలో భాగంగా ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన ప్రభుత్వం, రేషన్ కార్డుల మంజూరుపై పునఃసమీక్ష చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్నట్లుగా ఏపీఎల్ (APL), బీపీఎల్ (BPL) కార్డులను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. అలాగే, రైతు భరోసా నిధులను వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు వేగంగా అమలుచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు కులాల మధ్య విద్వేషం నింపేలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని హెచ్చరించారు. తాత్కాలికంగా ఉద్వేగానికి లోనై చేసే వ్యాఖ్యలు, భవిష్యత్తులో వారికే నష్టమవుతాయి అని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ నేత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి నడుం బిగించింది. ప్రతి వర్గానికి సమాన న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక చిచ్చు పెట్టే ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలి” అని అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన సర్వేకు వ్యతిరేకంగా వచ్చిన విమర్శలను ఖండిస్తూ, ఇది ప్రజల అభివృద్ధి కోసమే చేపట్టిన కార్యక్రమమని గుత్తా స్పష్టం చేశారు. ప్రభుత్వ సర్వేలో కొంతమంది ప్రముఖులు పాల్గొనకపోవడం సమంజసం కాదని, సర్వే తుది నివేదిక పూర్తయిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. సామాజిక, ఆర్థిక సర్వేపై కొన్ని అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం ప్రభుత్వం మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించారు. సర్వే ఫలితాలను అందరికీ అర్థమయ్యేలా ప్రభుత్వం వివరించాలని, దీని ద్వారా ప్రజలకు లాభం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.

 Vidadala Rajini : ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టకు విడదల రజిని